KTR on BRS: ధృడ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ది ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ‘స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ ఎందుకు ముఖ్యం’ అన్న అంశంపై శుక్రవారం లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో మాట్లాడారు.
సంపదను సృష్టించడంతో పాటు దాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమానంగా పంచడమే తమ పాలనలో తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మధ్య అద్భుత సమతుల్యత సాధించిందని తెలిపారు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతిశీల పనులు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎవరు చేయలేదన్నారు. తలసరి ఆదాయంలో 12వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా ఎదగవచ్చో తెలంగాణ నుంచి భారత్ లోని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చన్నారు. విప్లవాత్మక మార్పులను ఆహ్వానించడంతో పాటు నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించడమే తెలంగాణను మిగతా రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా మార్చిందన్నారు.
Also Read: Harish Rao on Congress: అవినీతిని ఆధారాలతో బయటపెడ్తాం.. మాజీ మంత్రి కామెంట్స్!
ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే చైనాలోని త్రీ గార్జియస్ డ్యామ్ కు సరిసమానమైన ప్రాజెక్టు తెలంగాణలోని కాళేశ్వరం అన్నారు. అన్ని రకాల అనుమతులను తీసుకొని, ప్రాజెక్టుతో నష్టపోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చి కేవలం 3ఏళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి దేశం మొత్తం నివ్వెరపోయేలా చేశామన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కోటి ఇండ్లకు మిషన్ భగీరథతో సురక్షిత మంచినీటిని అందించిందన్నారు.
తలసరి ఆదాయంలో 156% వృద్ధిని ఒక్క దశాబ్ద కాలంలోనే సాధించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ,ఫేస్బుక్ తో పాటు ప్రపంచంలోని ప్రఖ్యాత టెక్ కంపెనీలు అమెరికా తర్వాత తమ అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాదులో నెలకొల్పాయని చెప్పారు. కార్పొరేట్ సంస్థల్ని హైదరాబాద్ కు ఆహ్వానించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు.
Also Read: Indiramma Houses: అర్హతను బట్టి ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి సంచలన వాఖ్యలు!
తాము అధికారంలోకి రావడానికి ముందు 2014 లో టెక్ పరిశ్రమలో మూడు లక్షల 23వేలు ఉద్యోగాలు మాత్రమే ఉండేవని, అయితే తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి అవి పది లక్షలకు చేరాయన్నారు. ఇంతేకాదు 2014లో 56 వేల కోట్ల రూపాయలుగా ఉన్న ఐటీ ఎగుమతులు, 2023 నాటికి రెండు లక్షల 41 వేల కోట్ల రూపాయలకు చేరాయన్నారు. ఇదంతా తమ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, మార్గదర్శకత్వంతోనే సాధ్యమైందని తెలిపారు. టీఎస్ ఐపాస్ తో ఆన్ లైన్ లో ఎవరైనా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు వస్తాయన్నారు.
దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ విధానం లేదన్నారు. టీఎస్ఐపాస్ తో తమ పాలనలో 28 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఫలితంగా మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయన్నారు. 24 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పన జరిగిందన్నారు. సీఎంగా కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిందన్నారు. అభివృద్ది, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక పంథాను అనుసరించి వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పాలసీలపై తన అనుభవాలు, ఆలోచనలను పంచుకున్నారు.
Also Read: Chamala Kiran Kumar: కవితకు కాంగ్రెస్ నేత ఆఫర్.. అలా చేస్తే కలిసి వస్తా.. ఎంపీ చామల