Mahesh Kumar Goud: విపక్ష బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ (Etela Rajender)ను బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీశ్ రావు (Harish Rao) కలిసినట్లు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సూచన మేరకు ఈటలను హరీశ్ వెళ్లి కలిశారని పేర్కొన్నారు. ఒక ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా వీరి భేటి జరిగిందని అన్నారు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విషయంలో అంతా ఒకటే సమాధానం చెప్పాలని ఆ ముగ్గురు నిర్ణయించుకున్నట్లు టీపీసీసీ చీఫ్ అన్నారు. దీనిపై ఈటల రాజేందర్ వెంటనే సమాధానం చెప్పాలని నిలదీశారు.
బీజేపీపై కవిత సర్జికల్ స్ట్రైక్
బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని 100 సార్లు చెప్పామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కవిత బీజేపీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని పేర్కొన్నా. దానికి బీజేపీ కచ్చితంగా సమాధానం చెప్పాలని నిలదీశారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. కేంద్రంపై టీపీసీసీ చీఫ్ విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు భయపడి పాక్ పై యుద్ధాన్ని కేంద్రంలోని బీజేపీని విరమించుకుందని ఆరోపించారు. దేశ వ్యవహారాల్లో తలదూర్చేందుకు ట్రంప్ కు ఎందుకు అవకాశం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పాక్ పై యుద్ధం లో సాధించింది ఏంటి? కోల్పోయింది ఏంటి? చెప్పే బాధ్యత కేంద్రానికి లేదా అని నిలదీశారు. ఇందిరమ్మ గొప్పతనం పార్లమెంట్ రికార్డ్స్ చూసి కిషన్ రెడ్డి మాట్లాడాలని హితవు పలికారు. ఇందిరమ్మ అసలు సిసలైన ఉక్కుమనిషి అని కొనియాడారు.
కవితను సీరియస్‌గా తీసుకోలేదు
మరోవైపు కాంగ్రెస్ నేత కేశవరావు (K. Keshava Rao).. కవిత (Kavitha) అంశం గురించి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారివని తేల్చి చెప్పారు. కవిత వ్యాఖ్యలను, ఆమెను కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీరియస్ గా తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రజాపాలనలో ప్రజలే ముఖ్యమని కేకే అన్నారు. లీడర్లతో సంబంధం లేదని అన్నారు. ఒకవేళ కవిత కాంగ్రెస్ చేరినా పెద్దగా కలిసి వస్తుందని తానేమి అనుకోవడం లేదన్నారు. మరోవైపు పార్టీ తాను పార్టీ వీడుతున్నానంటూ చేస్తున్న ఆరోపణలపైనా కేకే స్పందించారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని.. కాంగ్రెస్ లోనే చస్తానని వ్యాఖ్యానించారు.
Also Read: Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. భారీగా హెరాయిన్ పట్టివేత
కాళేశ్వరంపై ముగ్గురికీ నోటీసులు
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉండగా.. హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి ఇటీవల కమిషన్ నోటీసులు ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ ను జూన్ 5న విచారణకు రావాలని సూచించింది. అలాగే హరీశ్‌రావును జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.