Nandi Awards in AP: సినీ పరిశ్రమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డు (Gaddar Awards) లను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తాజాగా ప్రకటించింది. 2024లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన పురస్కారాలను జ్యూరీ కమిటీ గురువారమే అనౌన్స్ చేసింది. ఇవాళ 2014 నుంచి 2023 మధ్య విడుదలైన చిత్రాల్లో ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాలను ప్రకటించారు. దీంతో ఏపీ ప్రభుత్వం (AP Govt) ప్రకటించాల్సిన నంది అవార్డులపై (Nandi Awards) అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు మురళీ మోహన్ (Murali Mohan).. గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మురళీ మోహన్ ఏమన్నారంటే?
రెండో రోజు గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా నటుడు మురళీ మోహన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూడా అవార్డులను ప్రభుత్వం ప్రకటించాలని సూచించారు. అయితే ఒకే తెలుగు సినిమాకు రెండు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చి.. ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం.. మరో ఏడాది ఏపీ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని సలహా ఇచ్చారు. లేదంటే తెలంగాణలో ఈ సినిమాకు.. ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డులు ఇచ్చారనేది వివాదస్పదమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు కావాలన్న మురళీ మోహన్.. ఒక రాష్ట్రం ఎక్కువ కాదు మరోటి తక్కువ కాదని స్పష్టం చేశారు. తెలంగాణ తెలుగు సినిమా, ఆంధ్రా తెలుగు సినిమాలని వేరు వేరుగా చూడొద్దని.. మూవీకి సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటేనని పేర్కొన్నారు. తెలుగు సినిమా అంతర్జాతీయ సినిమాగా ఎదిగిందని.. ప్రపంచ వ్యాప్తణగా ఆడుతుందని స్పష్టం చేశారు. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్లు బాగా చూస్తున్నారని చెప్పారు.
నందిపై ఏపీలో గందరగోళం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జూన్ 2, 2014న రెండు రాష్ట్రాలుగు విడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నంది అవార్డుల బాధ్యత విషయంలో గందరగోళం ఏర్పడింది. దీనివల్ల అటు ఏపీతో తెలంగాణలో 2012 నుండి 2016 వరకు ఎలాంటి నంది అవార్డులను ప్రకటించలేదు. అయితే 2017 మార్చిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం.. 2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులు అనౌన్స్ చేసింది. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్ లో 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులు ప్రకటించబడ్డాయి.
బాలయ్య వివాదం
2014 ఏడాదికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేకెత్తింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) నటించిన లెజెండ్ చిత్రానికి ఏకంగా 8 పురస్కారాలు రావడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (బాలకృష్ణ), ఉత్తమ దర్శకుడు (బోయపాటి శ్రీను) వంటి కీలక విభాగాలు ఆ సినిమాకే దక్కడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటి సీఎం చంద్రబాబుకు బాలకృష్ణ బావమరిది కావడం వల్లే అవార్డుల్లో పక్షపాతం చూపించారని ఆరోపణలు వచ్చాయి. రుద్రమదేవి (2015) చిత్ర దర్శకుడు గుణశేఖర్, తన సినిమా ఒక చారిత్రక కథాంశంతో ఉన్నప్పటికీ ఉత్తమ చిత్రం లేదా జ్యూరీ అవార్డుకు కూడా పరిగణించబడలేదని ప్రశ్నించారు. ‘మనం’ వంటి చిత్రానికి సెకండ్ ప్లేస్ ఇవ్వడంపై నాగార్జున (Akkineni Nagarjuna) సైతం అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
వైసీపీ హయాంలోనూ నిర్లక్ష్యం!
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా నంది అవార్డులను ప్రకటించకపోవడం పలు విమర్శలు తావిచ్చింది. సినీ నటులకు నంది అవార్డ్ ఇచ్చేందుకు వైసీపీ (YSRCP) ఆసక్తి చూపలేదన్న ఆరోపణలు వచ్చాయి. 2023లో సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ (Aswani Dutt).. YSRCP ప్రభుత్వం నంది అవార్డులకు బదులు ‘బెస్ట్ రౌడీ, బెస్ట్ గుండా’ అవార్డులను ఇవ్వడానికి ఆసక్తి చూపుతోందని విమర్శించారు. దీనిపై వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) ఘాటుగా సమాధానం ఇచ్చారు. దత్‌కు ‘బెస్ట్ లోఫర్, బెస్ట్ బ్యాక్‌స్టాబర్’ అవార్డులు ఇవ్వాలని వ్యంగ్యంగా విమర్శించారు.
కూటమి సర్కార్ కసరత్తులు
2014 తర్వాత తిరిగి 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. నంది అవార్డులను అందించేందుకు కార్యచరణను సిద్ధం చేస్తోంది. ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. రాష్ట్రంలో నంది అవార్డులను పునరుద్దరించాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన నేత, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh)కు నంది అవార్డుల బాధ్యతను అప్పగించారు. ‘బైరవం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. త్వరలోనే నంది అవార్డులను అందించనున్నట్లు ప్రకటించారు. చాలాకాలంగా మూలన పడ్డ చలన నంది అవార్డులను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే చలన చిత్ర అభివృద్ధికి అవసరైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చెప్పారు.