YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మానవత్వం చాటుకున్నారు. ఇప్పటికే పలుమార్లు, పలు సందర్భాల్లో ‘మానవత్వం చాటుకున్న జగన్’ అని వార్తల్లో చాలా సార్లు వినే ఉంటాం. అయితే తాజాగా, మరోసారి మానవత్వం చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. విజయవాడ వారధి వద్ద ఓ వృద్ధురాలిని బస్సు ఢీకొన‌్నది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలోనే నిర్మలా శిశువిహార్‌ను సందర్శించి తాడేపల్లి తిరిగి వస్తున్న వైఎస్ జగన్ ప్రమాదం వివరాలు తెలుసుకొని చలించిపోయారు. ఆమెను ఆస్పత్రికి చేర్చే వరకూ జగన్‌ను మనసు ఒప్పలేదు. దీంతో వెంటనే గాయపడిన ఆ వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌కు జగన్ అప్పగించారు. అయితే ఈ క్రమంలో అరుణ్ 108కు ఫోన్ చేశారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు నాలుగైదుసార్లు చేసినా స్పందించలేదు. దీంతో అటువైపుగా వెళ్తున్న ప్రైవేటు అంబులెన్స్‌ను ఆపి, వృద్ధురాలిని విజయవాడ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించేంతవరకూ అరుణ్ అక్కడే ఉండి వృద్ధురాలికి సహాయం, సపర్యలు చేశారు. జగన్ చేసిన సహాయంతో బాధితురాలి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
రాజారెడ్డి జయంతి వేడుకలు..
కాగా, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి, దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకలు విజయవాడ నగరంలోని నిర్మలా శిశు భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డికి నివాళులు అర్పించారు. శిశు భవన్‌లో ఉన్న పిల్లలతో జగన్, భారతి దంపతులు కాసేపు సరదాగా గడిపి, ముచ్చటించారు. పిల్లలతోనే కేక్ కూడా కట్ చేయించి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో వైఎస్ సోదరి వైఎస్ విమలారెడ్డి, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. కాగా, శిశు భవన్ దగ్గరికి జగన్ వస్తున్నారని తెలిసి వైసీపీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. మరోవైపు పులివెందులలోనూ రాజారెడ్డి శత జయంతి (Raja Reddy Jayanthi) వేడుకలను వైసీపీ శ్రేణులు, వైఎస్ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Read Also- Nara Lokesh: లోకేష్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చిందెవరు.. వైఎస్ జగన్ స్పందిస్తారా?
తొలి సమావేశం..
వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ తొలి సమావేశం జరిగింది. వైసీపీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ శెట్టిపల్లి రఘురామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్రమశిక్షణా కమిటీకి సంబంధించి విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్టీ క్రమశిక్షణకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. ఈ సమావేశంలో క్రమశిక్షణా కమిటీ సభ్యులు తానేటి వనిత, రెడ్డి శాంతి, కైలే అనిల్‌కుమార్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిలు (Thopudurthi Prakash Reddy) పాల్గొన్నారు. ఈ మధ్యనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో (Duvvada Srinivas) పాటు ఒకరిద్దరి నేతలపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. పార్టీ విధి విధానాలను దాటి ప్రవర్తించే వారిపైన చర్యలు తీసుకోవడానికి క్రమశిక్షణా కమిటీ పనిచేస్తున్నది.