MLA Raja Singh: కాషాయ పార్టీలో మరోసారి ధిక్కార స్వరం వినిపిస్తోంది. అటు హైకమాండ్, ఇటు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలు సైతం పట్టిచుకోవడంలేదు. ఇటీవలే హైకమాండ్ ఆదేశాల మేరకు స్టేట్ యూనిట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసినా వి డోంట్ కేర్.. అని పలువురు ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్టేట్ చీఫ్ ఆదేశాలను మరోసారి బేఖాతర్ చేస్తూ వార్తల్లో నిలిచారు. అంతేగాక సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్ కు కారణమయ్యారు. కవిత లేఖ, ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణపై ఎవరూ నోరుజారొద్దని సూచించినా నో యూజ్ అనేలా రాజాసింగ్ తీరు మారింది. కవిత వ్యాఖ్యలను ఏకీభవిస్తూ ఆయన కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడినవన్నీ నిజమేనని తాను అనుకుంటున్నట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ పార్టీ నేతలు సైతం బీఆర్ఎస్ తో కలిసిపోతారని సంచలన వ్యాఖ్యలు రాజాసింగ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సైతం తమ నేతలు కాకుండా వారే డిసైడ్ చేస్తారని బాంబు పేల్చారు. గతంలో కూడా ఇదే జరిగిందని, అందుకే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు.
Also Read: Jaleel Khan Health Issue: మహానాడులో షాకింగ్ ఘటన.. వేదికపై కుప్పకూలిన టీడీపీ నేత
తెలంగాణలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండేదని, కానీ ఇప్పటివరకు ఎందుకు అధికారంలోకి రాలేదనేది ఆలోచన చేయాలని సూచనలు చేశారు. ప్రతి ఎన్నికలో కాషాయ పార్టీ నేతలు కుమ్ముక్కైపోయారని, ఈ నిర్ణయం వల్లే కమలం పార్టీకి చాలా నష్టం జరిగిందని రాజాసింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్తకు తెలుసని, కానీ ఎవరూ చెప్పరని వెల్లడించారు. ఒకవేళ చెబితే వారు సస్పెండ్ అయినట్లేనని పేర్కొన్నారు. అందుకే అందరూ నోరు మూసుకొని కూర్చుంటారని వ్యాఖ్యానించడం గమనార్హం.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అటు బీఆర్ఎస్ లో.. ఇటు స్టేట్ పాలిటిక్స్ లో కవిత లేఖ సంచలనం రేకెత్తించింది. లిక్కర్ కేసులో తాను జైల్లో ఉన్న సమయంలో బీజేపీలో.. బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరిగాయన్న కవిత వ్యాఖ్యలకు.. రాజాసింగ్ కామెంట్స్ మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఈ వ్యాఖ్యలు బీజేపీకి డ్యామేజ్ అయ్యేలా ఉండటంతో శ్రేణుల్లో సైతం పలు రకాలుగా చర్చ జరుగుతోంది. విలీనం అంశంపై కవిత స్పందించడంతో పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వనుందని ప్రచారం జరిగింది. కానీ అలాంటి నిర్ణయమేది బీఆర్ఎస్ తీసుకోలేదు. ఇదిలా ఉండగా కవిత ఇష్యూ ఎలా ఉన్నా.. బీజేపీలో రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టినట్లయింది. నష్ట నివారణకు పార్టీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాజాసింగ్ పై ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.