MLA Revuri Prakash Reddy : మహిళల ఆర్థిక స్వయం స్వావలాంభన లక్ష్యంగా పాలడెయిరీ ఏర్పాటు చేస్తున్నట్టు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి మహాజనసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో డెయిరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా, ప్రారంభం నుండి అంచనాకు మించి కలెక్టర్లు కోఆర్డినేట్ చేస్తున్నారన్నారు. మహిళా డెయిరీ ఏర్పాటుకు కృషి చేస్తున్న రెండు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు. మహిళలు ఆర్థికాభివృద్ధి చెందడం ద్వారా ఆ కుటుంబాలు ముందుకెళ్తాయన్నారు. మహిళలు ఐక్యమత్యంగా ఉండి అనేక రంగాలలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. మహిళలు పరస్పర సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ములుకనూరు మహిళా డెయిరీ మహిళా శక్తికి నిదర్శనం అని పేర్కొన్నారు. ములుకనూరు డెయిరీ మాదిరిగానే పరకాల మహిళా డెయిరీ కూడా రానున్న రోజుల్లో విజయవంతంగా నడవాలన్నారు.
Also Read: Nara Lokesh: లోకేష్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చిందెవరు.. వైఎస్ జగన్ స్పందిస్తారా?
మహిళా డెయిరీ ఏర్పాటుతో మహిళలు అభివృద్ధి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరకాల మహిళ పాల డెయిరీ ని విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు కూడా మార్గదర్శకంగా నిలవాలన్నారు. మహిళ శక్తిని నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం అన్నారు. పాల డెయిరీ నిర్వహణకు పట్టుదలతో పని చేసి స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. తపన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. డెయిరీ ఏర్పాటుకు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ(ఎన్డిడి) సహకారం ఉంటుందన్నారు. అధికారులు అండగా ఉంటారని, మహిళలు ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు.
వారం రోజుల్లో కమిటీని ఏర్పాటు కావాలని సూచించారు.
సవాల్ గా తీసుకుని అంకితభావంతో పని చేయాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ డెయిరీ నిర్వహణకు సంబంధించి శిక్షణను పొందాలని అన్నారు. డెయిరీ నిర్వహణలో ప్రారంభంలో కొంత కష్టం ఉంటుందని, నిర్వహణను సవాల్ గా తీసుకుని హార్డ్ వర్క్ చేసి డెయిరీని విజయవంతంగా నిర్వహించాలన్నారు. డెయిరీని విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో పనిచేసే సమర్థవంతమైన లీడర్లను ఎన్నుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే రుణాలను డెయిరీ సంబంధిత యూనిట్లకు ఎక్కువగా వినియోగించుకోవాలన్నారు. పాల ఉత్పత్తి రంగానికి అనుబంధంగా ఉన్న రంగాలను కూడా ఎంచుకోవాలన్నారు.
Also Read: Meenakshi Natarajan: పార్టీ బలోపేతం కోసం ఏం చేద్దాం.. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్?
మహిళలు క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రత్యేక విజన్ తో మహిళలు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పాల డెయిరీ నిర్వహణను మహిళలు ఛాలెంజ్ గా తీసుకోవాలన్నారు. మహిళలు క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసి విజయం సాధించి ఇంకా అనేక మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ముల్కనూర్ డెయిరీ ఆదర్శంగా ముందుకు సాగుతాం
సమావేశంలో పాల్గొన్న పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మహిళలు మాట్లాడుతూ ఇటీవల ములుకనూరు పాల డెయిరీ ని సందర్శించామని, అక్కడ డెయిరీ నిర్వహణ, పాల సేకరణ, అభివృద్ధిపథంలో సాగుతున్న డెయిరీ గురించిన ఎన్నో విషయాలు తెలుసుకుని స్ఫూర్తిని పొందామని పేర్కొన్నారు. మహిళల ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా విజయపథంలో కొనసాగుతున్న ములుకనూర్ డెయిరీ మాదిరిగానే కొత్తగా ఏర్పడుతున్న పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల సమితిని ముందుకు తీసుకెళ్తామని పరకాల నియోజకవర్గంలోని మహిళలు పేర్కొన్నారు.
పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు కు ప్రత్యేక చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో హనుమకొండ వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్య దేవి, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ అధికారులు లత, సుందర్ రావు, పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Pawan Kalyan – Chandrababu: చంద్రబాబుపై పవన్ పొగడ్తల వర్షం.. మామూల్గా ఆకాశానికెత్తలేదు భయ్యా!