Kamal Haasan: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (Makkal Needhi Maiam) అధినేత కమల్ హాసన్ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. తమిళనాడు రాష్ట్రం నుంచి రాజ్య సభ సభ్యుడిగా ఆనయ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. కమల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అధికార డీఎంకే బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
డీఎంకే అధికారిక ప్రకటన
రాజ్యసభలో ఖాళీగా ఉన్న 8 స్థానాలకు వచ్చే నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తమిళనాడు నుంచి 6 ఉండగా.. అసోం నుంచి మరో రెండు స్థానాలు ఉన్నాయి. అయితే తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంఖ్యా బలం పరంగా చూస్తే 6 రాజ్యసభ స్థానాలకు గాను 4 డీఎంకే సొంతం కావడం అనివార్యంగా కనిపిస్తోంది. మరో రెండు విపక్ష అన్నాడీఎంకే దక్కే అవకాశముంది.
రాజ్యసభకు కమల్ హాసన్
DMK మద్దతుతో రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కానున్న కమల్
2024 ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందంలో భాగంగా కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు కేటాయిస్తామన్న DMK
4 రాజ్యసభ సీట్లలో ఒక సీటును కమల్ కు కేటాయించిన DMK
జూన్ 19న తమిళనాడు, అసోం రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు… pic.twitter.com/GgZ0pyjyV0
— BIG TV Breaking News (@bigtvtelugu) May 28, 2025
ఒప్పందంలో భాగంగానే
ఇదిలా ఉంటే తాజాగా డీఎంకే తన పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో ఒకరు కమల్ హాసన్ కావడం ఆసక్తికరంగా మారింది. మిగిలిన ముగ్గురు అభ్యర్థులు ఎంపీ విల్సన్, తమిళ రచయిత సల్మా, డీఎంకే నేత ఎస్.ఆర్. శివలింగంగా ఉన్నారు. అయితే ముందస్తు ఒప్పందం ప్రకారమే ఎన్‌ఎంఎం (Makkal Needhi Maiam) పార్టీ అధినేత కమల్ హాసన్ కు రాజ్యసభ కేటాయించినట్లు తెలుస్తోంది.
ప్రభావం చూపని కమల్ పార్టీ!
కమల్ పార్టీ అయిన మక్కల్ నీది మయ్యమ్ విషయానికి వస్తే.. దానిని 2018 ఫిబ్రవరి 21న స్థాపించారు. 2024 ఎన్నికలు మినహా అప్పటివరకూ జరిగిన ప్రతీ ఎన్నికలోనూ ఎంఎన్ఎం పార్టీ పోటీ చేస్తూ వచ్చింది. అయినప్పటికీ తమిళ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 3.72 శాతం ఓటు షేర్ మాత్రమే కమల్ పార్టీ సాధించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా ఒక్క సీటు రాలేదు. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్ సైతం ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులోని ఇండియా కూటమికి కమల్ పార్టీ మద్దతు ఇచ్చింది. రాజ్యసభకు పంపే విషయమై అధికార డీఎంకేతో కమల్ ఒప్పందం చేసుకున్నారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
Also Read: Sr NTR Birth Anniversary: ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు, తారక్ ఘన నివాళులు.. వీడియోలు వైరల్
కన్నడ భాష వివాదంలో కమల్!
ఇదిలా ఉంటే కన్నడ భాషపై తాజాగా కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో కర్ణాటక భాజపా అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప నటుడిపై తీవ్రంగా మండిపడ్డారు. మాతృభాషను ప్రేమించడం మంచిదే కానీ.. ఇతర భాషలను అవమానించడం సరైన పద్దతి కాదని అన్నారు. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని కమల్ హాసన్ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎక్స్ వేదికగా పట్టుబట్టారు. చెన్నైలో జరిగి థగ్ లైఫ్ ఈవెంట్ లో కమల్ మాట్లాడుతూ.. కన్నడ కూడా తమిళం నుంచి పుట్టిందేనని వ్యాఖ్యానించారు.