Telangana Formation Day: జూన్ 2న తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని BRS జిల్లా కార్యాలయాలతో పాటు నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగరేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులంతా పాల్గొనాలని, ప్రజలతో కలిసి అవతరణ వేడుకలు ఘనంగా జరపాలని కేటీఆర్ సూచించారు
6 దశాబ్దాల కల సాకారం
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జూన్ రెండవ తేదీన పార్టీ వ్యవస్థాపక సభ్యులు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదన చారి పాల్గొని జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని కేటీఆర్ తెలియజేశారు. ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు , విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని కేటీఆర్ గుర్తు చేశారు.
Also Read: PM Modi: అలా చేసి ఉంటే పీఓకే మన సొంతమయ్యేది.. ప్రధాని మోదీ
యావత్ దేశానికి ఆదర్శం
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కార్ కు దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని కేటీఆర్ స్పష్టం చేశారు.