Kandula Durgesh: సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మరోసారి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి దుర్గేష్ పలు విషయాలను వెల్లడించారు. సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా సహకారాన్ని అందిస్తుందో స్పష్టంగా వివరించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసి కట్టుగా వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేసేందుకు, అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. సినీ ప్రముఖులు కలవాలన్నది తమ ఉద్దేశం కాదని, కలిసినా.. కలవకపోయినా సినీ రంగంపై తాము కక్ష సాధించబోమన్నారు. సినిమాకు సంబంధించిన అనుమతులు, టికెట్ రేట్ల నిర్ణయాల్లో తక్షణ స్పందనతో పరిశ్రమకు మద్దతు అందిస్తున్నామని మరోసారి గుర్తు చేశారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి నూతన ఫిల్మ్ పాలసీ రూపొందించడంపై కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read- Allu Aravind: పవన్ కళ్యాణ్ చెప్పింది 100 శాతం నిజం? ఆ నలుగురిలో నేను లేను!
జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలన్న నిర్ణయంపై హోం శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ జరుగుతోందని, హోం శాఖ విచారణ అనంతరం నివేదిక అందించిన తర్వాత అసలు వాస్తవాలు వెల్లడిస్తామని అన్నారు. జూన్ 12న విడుదల కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం విషయంలో ఈ తరహా సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయో వాస్తవాలు వెలికితీస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలో పనిచేసే వర్గాల హితం, కళాకారుల హక్కులు, ప్రజల అభిరుచి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైన విషయాలుగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను అస్థిరపరిచే చర్యలు ఎవరి నుంచి వచ్చినా సహించమని, చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఎవరి ప్రభావంతోనైనా పరిశ్రమలో కల్లోలం సృష్టించాలన్న యత్నాలను అస్సలు ఉపేక్షించమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో సినిమావాళ్లను వేధించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సినీరంగాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో ఒకసారి గమనించాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
Also Read- Tollywood: పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ వేసిందెవరు?.. వైసీపీ కీలక నేత రివెంజేనా?
రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణ కూటమి ప్రభుత్వ సమిష్టి విజయం
తెలుగు భాషపై ఉన్న మక్కువతో నాటి సీఎం ఎన్టీఆర్ తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారని మంత్రి దుర్గేష్ ఆ ప్రస్థానాన్ని చెప్పుకొచ్చారు. అందుకు ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకరించారని అన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణ అంశాన్ని కేబినెట్ దృష్టికి, సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దృష్టికి తాను తీసుకెళ్లానని తెలిపారు. ఇందులో సహజంగానే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఉంటుందన్నారు. నిర్ణయం వచ్చిన వెంటనే కేబినెట్‌కు సైతం ధన్యవాదాలు తెలిపామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణ కూటమి ప్రభుత్వ సమిష్టి విజయంగా భావిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కందుల దుర్గేష్ వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు