Fake Forest Officer: అటవీ శాఖ ఉద్యోగిగా చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలు చేస్తున్న వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ముషీరాబాద్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి నకిలీ గుర్తింపు కార్డు, కిరణ్ కుమార్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్లు, బైక్, ఖాకీ యూనిఫాంతోపాటు 5.45లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్ గూడ కృష్ణానగర్ నివాసి కొనకంచి కిరణ్ కుమార్ (30) తాను అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ గా పని చేస్తున్నట్టు ప్రచారం చేసుకున్నాడు.
Also Read: Notice to Jhansi reddy: కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి షాక్!..హైకోర్టు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
జనాన్ని నమ్మించటానికి తన బైక్ పై పోలీస్ అని రాయించుకుని సైరన్ ను ఏర్పాటు చేయించుకుని తిరిగేవాడు. తనకు పెద్ద పెద్ద ఆఫీసర్లతో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సుభాష్ కుమార్, అశ్వినీతోపాటు మరికొందరు నుంచి 20లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ తరువాత అందరినీ మోసం చేశాడు. ఈ మేరకు బాధితులు చేసిన ఫిర్యాదులతో అతనిపై ఎనిమిది పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చాలా రోజులుగా తప్పించుకు తిరుగుతున్న కిరణ్ కుమార్ గురించి పక్కగా సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ యదేందర్, ఎస్సై నవీన్ తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి ఆదివారం అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితున్ని ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Serilingampalli: నకిలీ పత్రాలతో వేరొకరి స్థలంలో బిల్డింగ్ నిర్మాణం.. భవనం సీజ్!