Kiran Royal: తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ కానున్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలకు ముందు బంద్ వార్తలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కావాలనే పవన్ సినిమాను టార్గెట్ చేస్తున్నారా? అన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సైతం టాలీవుడ్ సంఘాలకు అక్షింతలు వేస్తూ లేఖ విడుదల చేశారు. తాజాగా ఈ వివాదంపై తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడే నిరసనలు గుర్తొచ్చాయా?
థియేటర్ల బంద్ అంశంపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. తాము పార్టీ పరంగా కాకుండా పవన్ అభిమానులుగా మాట్లాడుతున్నట్లు చెప్పారు. జూన్ 1 నుండి థియేటరల్లో సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తారని తమ దృష్టికి వచ్చిందని కిరణ్ రాయల్ అన్నారు. పవన్ సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి నిరసనలు గుర్తుకు వస్తాయా? అని ప్రశ్నించారు.
ఆ నలుగురు కక్ష కట్టారు!
పవన్ నటించిన హరిహర విరముల్లుపై ఆ నలుగురు వ్యక్తులు (పేర్లు ప్రస్తావించలేదు) కక్షకట్టారని కిరణ్ రాయల్ అన్నారు. అందుకే ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి గుర్తుకు రాలేదా? అంటూ నిలదీశారు. ఆ రోజు సీఎం జగన్ తనతో మాట్లాడేందుకు ఆ నలుగురిని 2 కి.మీ నడిపించారని అన్నారు. అధికారంలో ఉనప్పుడు పవన్ సినిమాను జగన్ ఆపుతారని.. అధికారంలో లేకపోయే సరికి ఆ నలుగురు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
Also Read: AP Deputy CMO: తెలుగు చిత్రసీమ సంఘాలపై ఏపీ డిప్యూటీ సీఎం అక్షింతలు
సినిమా అడ్డుకున్నారో.. ఇక అంతే!
తమ హీరో సినిమాను ఆపితే ఆ తర్వాత జరిగే పర్యవసానాలకు తాము బాధ్యత వహించమని కిరణ్ రాయల్ హెచ్చరించారు. థియేటర్ల బంద్ కుట్రపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ విచారణకు ఆదేశించారని చెప్పారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో నలుగురికి సాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాపై కక్ష కడతారా? అంటూ ప్రశ్నించారు. పవన్ మూవీ కోసం అన్ని పార్టీలలోని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని జనసేన నేత అన్నారు. పవన్ సినిమాపై కుట్రలు చేసి సినిమా ఆపాలని చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహం చూస్తారని హెచ్చరించారు. అన్ని హీరోల సినిమాల విడుదల సమయంలో మాట్లాడని నోర్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.