TPCC Mahesh Kumar Goud: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నారని విమర్శించారు. ఏకు మేకై మరో పవర్ సెంటర్ రావడంతో కేటీఆర్ కు మతి భ్రమించిందని ఆరోపించారు. అందుకే రేవంత్ రెడ్డిపైన కేటీఆర్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
కేటీఆర్ భయపడుతున్నారు!
కవిత ఎపిసోడ్ ను డైవర్ట్ చేయడానికే సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ తప్పిదాలను కవిత ఎత్తి చూపారని అన్నారు. కాళేశ్వరం అవినీతిలో మాజీ కేసీఆర్ కు నోటీసులు రావడంతో కేటీఆర్ భయపడుతున్నారని అన్నారు. అయితే బీఆర్ఎస్, బీజేపీకి మధ్య అవగాహన ఉన్నట్లు కవిత వ్యాఖ్యలతో స్పష్టమయ్యిందని చెప్పారు.
భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉండదు!
విపక్ష బీఆర్ఎస్ త్వరలో మూడు ముక్కలు కాబోతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. కవిత, కేటీఆర్ మధ్య పోటీ తీవ్రం కావడంతో అదును కోసం హరీష్ రావు ఎదురు చూస్తున్నారని అన్నారు. దిక్కుతోచని స్థితిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని సెటైర్లు వేశారు. కేసిఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని టీపీసీసీ చీఫ్ అన్నారు. పదేళ్ల అవినీతికి సంబంధించిన పంపకాల్లో తేడా రావడం వల్లే కవిత బయటకు వచ్చారని అన్నారు. భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదని అభిప్రాయపడ్డారు.
Also Read: CM Chandrababu: ఒక్క స్పీచ్‌తో ఏపీ ఫ్యూచర్ చెప్పేసిన చంద్రబాబు.. షాకైన ప్రధాని!
కవిత లేఖ గురించి ముందే చెప్పా!
బీఆర్ఎస్ లో కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 10రోజుల క్రితమే కవిత లేఖ గురించి తాను చెప్పానని గుర్తుచేశారు. బీఆర్ఎస్ లో దెయ్యం ఎవరో కాదని.. సంతోష్ రావు అని సంచలన ఆరోపణలు చేశారు. సొంత కూతుర్ని కూడా కలవలేని పరిస్థితిని సృష్టించారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో తమిళనాడు జయలలిత లాంటి పరిస్థితులు ఉన్నాయని సామ రామ్మోహన్ అన్నారు. సొంత కుటుంబ సభ్యులే వెన్ను పోటుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పై ఆరోపణలు చేసే ముందు ఇంట్లో కూర్చొని సమస్యను సరిద్దిదుకోవాలని సూచించారు.