TDP Mini Mahanadu: మహానాడు ద్వారా నేతలను ఐక్యం చేయాలని భావించిన అధికార టీడీపీ (TDP)కి తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. మహానాడుకు ముందు వివిధ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న మినీ మహానాడు కార్యక్రమాల్లో టీడీపీ నేతలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టేలా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక క్యాడర్ తలలు పట్టుకుంటున్నాయి. ఒంగోలు మహానాడులో జనసేన నేత బాలినేని (Balineni Srinivasa Reddy) పై టీడీపీ నేత దామరచర్ల జనార్థనరావు (Damacharla Janardhana Rao) విరుచుకు పడ్డారు. ఆ తర్వాత పాయకరావుపేట మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ప్రభుత్వంపై విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కర్నూలు జిల్లా మహానాడులోనూ మాటల మంటలు చెలరేగాయి.
టీజీ భరత్ vs కేఈ ప్రభాకర్
కర్నూలు జిల్లా మహానాడులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ (TG Bharath)పై మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ (K.E. Prabhakar) ఘాటుగా విమర్శలు చేశారు. మహానాడుకు మంత్రి హాజరు కాకపోవడం బాధగా ఉందంటూ వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన మంత్రి లేకుండా మహానాడు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ బీజీపీలోకి వెళ్లినప్పుడు.. పులి వెళ్లిపోయినా పులిబిడ్డ టీజీ భరత్ టీడీపీలోనే ఉన్నాడని సంతోషించామని అన్నారు. ఆయన్ను గెలిపించుకొని మంత్రిని చేశామని అన్నారు. అటువంటి వ్యక్తి.. మహానాడుకు రాకపోవడం బాధగా ఉందని కేఈ ప్రభాకర్ విమర్శించారు.
మంత్రి పనులకు సిగ్గు పడుతున్నా!
తాము గతంలో పనిచేసినప్పుడు ఎప్పుడు ఇలా జరగలేదని కేఈ ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ మేయర్లను దించేస్తున్నారని.. కర్నూలులో ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. మీకు వైసీపీ మేయర్ కు ఒప్పందాలు ఉన్నాయా? మంత్రి టీజీ భరత్ ను ప్రశ్నించారు. వైసీపీ నాయకులతో కలిసి వ్యాపారాలు చేస్తుంటే సిగ్గుతో తలదించుకింటున్నామని అన్నారు. మీరు జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా మంత్రేనని.. వైసీపీ వారిని ఆర్థికంగా పైకి తీసుకు రావొద్దని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. 2 నెలల చూస్తామని.. తీరు మారకుంటే సీన్ లోకి తానే స్వయంగా దిగుతానని కేఈ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడలేరని చెప్పుకొచ్చారు.
Also Read: CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్.. ఈసారి కథ వేరుంటది.. ఎందుకంటే!
ఆ నేతలు సైతం..
మినీ మహానాడులో సొంత నేతల మాటలు.. టీడీపీలో విభేదాలు పెంచుతున్నాయి. ఇటీవల ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) తమ నియోజకవర్గంలో కొత్తవారిని అడుగుపెట్టనివ్వమంటూ నేరుగా అధిష్టానానికే అల్టిమేటం జారీ చేశారు. ఒంగోలు మహానాడులో జనసేన ముఖ్యనేతను తిట్టడం ద్వారా దామచర్ల జనార్థన్ కూటమిలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేశారు. అలాగే తన మాడుగల నియోజక వర్గాన్ని అసలు పట్టించుకోవడం లేదని.. మంత్రులు, ప్రభుత్వం వివక్ష చూపిస్తోందంటూ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ (Bandaru satyanarayana murthy) చేసిన కామెంట్స్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. నాయకుల తీరుతో టీడీపీ క్యాడర్ గందరగోళంలో మునిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.