YS Jagan on TDP: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై మరోమారు విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జగన్.. కూటమి తప్పులను ఎండగట్టారు. గత 12 నెలల చంద్రబాబు పాలనలో చోటుచేసుకున్న స్కాములు, దోపిడీలు, అవినీతి, అప్పుల వివరాలను మీడియాకు వెల్లడించారు. కాగ్ నివేదిక గురించి ప్రస్తావించిన జగన్.. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించలేదని.. సంక్షేమం ఊసే లేదని ఆరోపణలు చేశారు.
12 నెలల్లో రికార్డు స్థాయి అప్పులు
గత 12 నెలల కాలంలో సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. మోసాలతో ప్రభుత్వాన్ని నడిపారని ఆక్షేపించారు. పెట్టుబడులు రాకపోగా.. ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిందని విమర్శించారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతంగా మాత్రమే ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు అప్పుల సామ్రాట్ అని.. తమ ఐదేళ్ల పాలనలో రూ. 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే రూ.1,37,546 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.
Also Read: Miss World Contestants: శిల్పారామంలో అందాల భామల సందడి.. బతుకమ్మ ఆడిన వీడియో వైరల్
మైనింగ్‌లో రూపాయి రావట్లేదు
రాష్ట్రంలో కుంభకోణాలు పరాకాష్టకు చేరాయని వైఎస్ జగన్ ఆరోపించారు. లిక్కర్, ఇసుక, క్వార్ట్జ్, మైనింగ్, సిలికా ఇలా అన్ని మాఫియాలు ప్రస్తుతం ఏపీలో నడుస్తున్నాయని విమర్శించారు. మైనింగ్ నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రావడం లేదన్న జగన్.. దానిని ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు దోచిపెడుతున్నారని ఆరోపించారు. తమ హయాంలో ఒక యూనిట్ విద్యుత్ ను రూ.2.49కే కొనుగోలు చేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 4 గంటల పీక్ అవర్ కోసమంటూ యూనిట్ రూ. రూ.4.60 చొప్పున కొనేందుకు ఒప్పందం చేసుకుందని ఆక్షేపించారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారని ఆరోపించారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలీదు గానీ.. ఉర్సా అనే సంస్థకు బిడ్ లేకుండా రూ.2 వేల కోట్ల విలువైన భూములు అప్పనంగా ఏపీ ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు.