Congress Women Wing: కాంగ్రెస్ పార్టీ ఉమెన్ వింగ్‌లో చీలికలు ఏర్పడ్డాయి. మహిళా నేతలు రెండు వర్గాలుగా డివైడయ్యాయి. ప్రస్తుత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కు వ్యతిరేకంగా గోషామహల్ నియోజకవర్గ మహిళలు తమ స్వరాన్ని పెంచారు. స్వయంగా గాంధీభవన్ లో ధర్నా చేశారు. సునీతారావు హాటావో..మహిళా కాంగ్రెస్ బచావో అంటూ నినాదించారు.ఆమెతో పార్టీకి నష్టం జరుగుతుందంటూ మండిపడ్డారు. పనిచేసినోళ్లకు ప్రయారిటీ ఇవ్వడం లేదని వివరించారు.
కొంత మందితో టీమ్ గా ఏర్పడి, పదవుల కోసం పాకులాడుతుందని విమర్శించారు. పదవి కోసం ఏకంగా పీసీసీ అధ్యక్షుడిని కూడా విమర్శిస్తున్నరని, పార్టీ ప్రెసిడెంట్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గోషామహల్ నియోజకవర్గ మహిళలు మండిపడ్డారు. పార్టీ వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబద్ధతకు, క్రమ శిక్షణకు మారు పేరైన పీసీసీ చీఫ్ పై బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదని హెచ్చరించారు. సునీతరావు తన పద్దతి మార్చుకోవాలని మహిళా నేతలు ఫైర్ అయ్యారు.
కార్యవర్గం తెచ్చిన పంచాయితీ…
పీసీసీ కార్యవర్గంలో తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ మహిళా వింగ్ ప్రెసిడెంట్ సునీతరావు పట్టుబడుతున్నారు. తనకు ఛాన్స్ ఇవ్వకపోతే తన టీమ్ లో మరోకరికి ఇచ్చినా పర్వాలేదని ఆమె కోరుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నామని, పీసీసీ కార్యవర్గంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనంటూ ఆమె డిమాండ్ చేశారు. పైగా తన అనుచరులంతా రెండు రోజుల క్రితం గాంధీభవన్ లోని పీసీసీ ఛాంబరు ముందు నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో పీసీసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైకమాండ్ తీసుకునే నిర్ణయంలో తమ పాత్ర లేదంటూ పీసీసీ చెప్తూ వస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గోషామహల్ నియోజకవర్గ మహిళలంతా సునీతారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గోషామహల్ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె పార్టీ, ప్రభుత్వంలో కీలక పదవి కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు.
Also Read: Telangana Police: మొబైల్ ఫోన్ల రికవరీలో అగ్రస్థానం.. మరో ఘనత సాధించిన తెలంగాణ పోలీస్!