Thummala Nageswara: గత పదేళ్లుగా అపెక్స్ సహకార సంఘాల ఆడిట్ ఎందుకు జరగలేదని ఆడిట్ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పశ్నించారు. వారితీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఆడిట్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్సీఎస్ కమిషనర్ ను ఆదేశించారు. అదేవిధంగా అన్ని అపెక్స్ సహకార సంఘాలను ఆడిట్ చేయాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, సహకార శాఖ, విత్తనాలు, మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్ధంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ నాబార్డ్, ఆర్ఐడీఎఫ్ నిధులను ఉపయోగించి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాంలు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉన్న గోదాముల సామర్థ్యం , కోల్డ్ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచే విధంగా రాష్ట్రంలో మరిన్ని గోదాంలు, కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలని అధికారులకు సూచించారు. నాబార్డ్, ఆర్ఐడీఎఫ్ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు.
రైతులు మాత్రమే ఉత్పత్తులను అమ్ముకునేలా రైతుబజార్లను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మార్కెట్లు, రైతు బజార్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్ యార్డుల పునర్విభజనకు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని వెంటనే ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్లలో డిజిటల్ బోర్డుల ఏర్పాటుపైనా ఆరా తీశారు.
వానాకాలం సీజన్ లో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మే నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి, వాటి ఫలితాలు రెండు నెలలోపు రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రైతుకు మట్టి నమూనా పరీక్ష ఫలితాలు అందేవిధంగా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని మార్కెట్ యార్డులలో, రైతు వేదికలలో ఈ సౌకర్యాన్ని కల్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జొన్నల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పీఏసీఎస్ సీఈఓల బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికే వెసులుబాటు కల్పించిందని, తదనుగుణంగా స్టేట్ లెవల్ కమిటీ ద్వారా బదిలీలపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 311 పీఏసీఎస్ లను ఎఫ్పీఓ లుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పీఏసీఎస్ లు, డీసీసీబీలకు సంబంధించి ఎంక్వైరీ పూర్తై, సర్ చార్జీ ఉత్తర్వులు జారీచేశామని, ఇప్పటివరకు 6 కోట్ల 38 లక్షల రివకరి పూర్తయిందని, ఇంకా 19కోట్లు రికవరీ చేయాల్సి ఉందని, 74 సర్ చార్జ్ లు పెండింగ్ ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన రికవరీని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయిల్ పెడ్ సంస్థ మిగిలిన అన్ని కంపెనీలకు మార్గదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, సహకార అడిషనల్ రిజిస్ట్రార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.