TTD Update: తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీటీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను టీటీడీ ఈవో జె.శ్యామలరావు మీడియాకు వివరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆమోదం వచ్చాక దశలవారీగా 2025-26 ఏడాదిలో రూ.1.74కోట్లు, 2026-27లో రూ.1.13 కోట్లు, 2027-28లో రూ.1.13 కోట్లు అటవీశాఖకు విడుదల చేయాలనీ టీటీడీ తీర్మానించింది.
టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల అభివృద్ధి కోసం బృహత్ ప్రణాళికను తయారు చేసేందుకు ఆర్టిటెక్ట్ ల నుండి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమలలోని విశ్రాంత భవనాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్దరు దాతలు స్పందించలేదని.. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు తిరుమలపై అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలను భక్తులు విశేష సంఖ్యలో సందర్శిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆధ్యాత్మిక, పర్యావరణ, మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు టీడీపీ ఈవో శ్యామలరావు తెలిపారు. రాయలసీమకే తలమానికంగా ఉంటూ ఎందరో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆర్థిక సహాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న రూ.60 కోట్లతో పాటు అదనంగా మరో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. స్విమ్స్ లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Also Read: YS Jagan Warning: వచ్చేది మన ప్రభుత్వమే.. ఇక వారికి సినిమానే.. జగన్ వార్నింగ్
టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్తులను బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, స్వచ్ఛంద పదవీ విరమణకు చర్యలు తీసుకునేందుకు టీటీడీ బోర్డ్ ఆమోదం తెలిపింది. తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఒంటిమిట్టలో భక్తులకు అన్నదానం సేవలను మరింత పెంచాలని టీటీడీ నిర్ణయించిన ఈవో శ్యామలరావు తెలిపారు. తుళ్లూరు మండలం అనంతవరంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రబృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం.