MLA Harish Rao: తెలంగాణ అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయింది. బీరాలు పలికిన బీసీ డిక్లరేషన్ కు దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా నల్లమల డిక్లరేషన్ తెరమీదకు తీసుకొచ్చారు. అర్బాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప, అమలు చేసే డెడికేషన్ మాత్రం అస్సలు లేదు. పైన పటారం లోన లోటారం. డిక్లరేషన్ల పేరిట డంబాచారం’ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. తాను నల్లమల బిడ్డనని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి, తనను కలుసుకోవడానికి వచ్చిన అమాయక చెంచు బిడ్డలను అరెస్టు చేసి తన నిరంకుశ నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడన్నారు. ఎక్కడిక్కడ ముందస్తు అరెస్టులు చేసి, చెంచు ఉద్యమ నాయకులను నిర్బందించి నల్లమల డిక్లరేషన్ ప్రకటించడమే ప్రజా పాలనా? అని ప్రశ్నించారు.
ఎప్పటి లాగే రేవంత్ ప్రసంగంలో తెచ్చి పెట్టుకున్న ఆవేశం తప్ప, కంటెంట్ లేదు, కాంటెస్ట్ లేదన్నారు. ఆత్మస్తుతి పరనింద తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట లేదు. అలవాటైన ఊకదంపుడు ప్రసంగాన్నే అదే పనిగా దంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిపాలన ప్రయోజానలను ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారని డబ్బా కొట్టుకున్నడన్నారు. మీ అసమర్థ పాలనలో అమలు కాని హామీలను ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారన్నారు. రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ రైతులు బావురుమంటున్నారన్నారు. కల్లాల దగ్గర పడిగాపులు కాస్తూ కన్నీరు పెట్టుకుంటున్న రైతులు, వడగండ్లతో పంట నష్టపోయి గుండెలు బాదుకుంటున్న రైతులు మిమ్మల్నే గుర్తు చేసుకుంటున్నారన్నారు.
Also Read: Hyderabad Blast Plot: పేలుళ్ల కుట్ర కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..
మహాలక్ష్మి కింద నెల నెలా రావాల్సిన 2500 ఇంకా రావడం లేదని ఆడబిడ్డలు, కల్యాణ లక్ష్మి కింద రావాల్సిన తులం బంగారం కోసం ఆడపిల్ల తల్లిదండ్రులు మీరిస్తామన్న స్కూటీల కోసం ఆశగా ఎదురు చూస్తున్న యువతులు పదే పదే గుర్తు చేసుకుంటున్నారన్నారు. విద్యా భరోసా కింద ఇస్తామన్న 5 లక్షల కార్డు కోసం విద్యార్థులు, ఏడాదిలో ఇస్తామని చెప్పి ఏడాదిన్నర దాటుతున్నా రాని 2లక్షల ఉద్యోగాల కోసం, ఏ నెలకు ఆ నెలకు ఖాళీలను భర్తీ చేస్తూ ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారన్నారు.
ఇంకా పింఛన్లు పెంచుతలేవని అవ్వాతాతలు, దివ్యాంగులు, నిస్సహాయులు, డీఏ, పీఆర్సీ, పింఛన్ ప్రయోజనాల కోసం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, తమను ఎప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తారా? అని ఆర్టీసీ కార్మికులు నిత్యం నిన్నే తలుచుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి అతిశయోక్తులు ఎట్లా ఉంటాయంటే, అమాస నాడు పున్నమి వెన్నెల అనగలడు అని ఎద్దేవా చేశారు. ఓవైపు నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే, నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దంటున్నారని తుపాకీ రాముడి డైలాగులు పేలుస్తూ కామెడీ చేస్తున్నాడన్నారు.
దేశాలు తిరిగి తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న పెట్టుబడుల వ్యవహారం ఎట్లుందంటే, సచ్చిపోయిన బర్రె పగిలి పోయిన కుండెడు పాలు ఇచ్చిందన్న చందంగా ఉందని విమర్శలు చేశారు. అసలు ఆరు గ్యారెంటీల ఊసెత్తడమే మానేసిండు.. ఇంతకన్నా మోసం, దగా ఇంకేం ఉంటుందన్నారు. నెంబర్ వన్ రాష్ట్రం అని సీఎం మాట మార్చిండన్నారు. రేవంత్ రెడ్డి రంగులు మార్చే తీరును చూసి నల్లమల అడవుల్లోని ఊసరవెళ్లులు కూడా నివ్వెరపోతున్నాయన్నారు.
Also Read: Saheli NGO: మహిళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మిషన్‌లో రూ.5 కాయిన్ వేస్తే శానిటరీ నాప్కిన్