Theatre Bandh: ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడు లాభపడినట్లుగా, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంతో ఓటీటీ సంస్థలకు లాభం చేకూరుతుందా? అంటే అవునని చెప్పక తప్పదు. అసలే థియేటర్లకు ప్రేక్షకులు రాక ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు పర్సెంటేజీ ఇస్తేనే అంటూ థియేటర్లను మూసి వేసేలా ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవడంతో.. సినీ మేధావులందరూ ఇదే అనుకుంటున్నారు. కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గించేశారు. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఒకటి రెండు రోజులు హడావుడి ఉంటుంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఇంకో వారం సందడి ఉంటుంది. లేదంటే మొదటి రోజే దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read- Vishnu Manchu: ప్రభాస్‌ను పొగుడుతూ.. మంచు మనోజ్‌పై విమర్శలు!
మరి ఇలాంటి సమయంలో అద్దెలు, పర్సెంటేజీలను పక్కన పెట్టి, థియేటర్లకు ప్రేక్షకులను ఎలా రప్పించాలా? అని ఆలోచించకుండా ఎగ్జిబిటర్లు ఇలా పంచాయితీలకు దిగడం ఏమిటో అర్థం కావడం లేదు. ఒకవైపు ఐపీఎల్ రూపంలో రెండు నెలలుగా సరైన సినిమానే థియేటర్లలోకి రాలేదు. నాని ‘హిట్ 3’, రెండు మూడు స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాలు మినహా.. రెండు నెలలుగా పెద్ద సినిమాలేవీ విడుదల కాలేదు. జూన్ నుంచి పెద్ద సినిమాల సందడి స్టార్ట్ కాబోతున్న సమయంలో, సడెన్‌గా మాకు పర్సంటేజ్‌ల రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని, లేదంటే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో దిల్ రాజు, సురేష్ బాబు వంటి నిర్మాతలతో.. ఆదివారం సుమారు 60 మంది ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఇకపై అద్దెల రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని, వారికున్న బాధలను విన్నవించుకున్నారు.
మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం పర్సంటేజీలు ఇవ్వలేమని, మాకేం ఏం మిగలడం లేదని లెక్కలతో సహా చూపించారని తెలుస్తోంది. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యను సాల్వ్ చేయడం ఎలా? అంటూ నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. దీనిపై మరోసారి సమావేశం కావాలని నిర్మాతలు భావిస్తే, ఏదో ఒకటి తేల్చాలని, లేదంటే థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు హుకుం జారీ చేశారని టాక్ నడుస్తుంది. మొత్తంగా చూస్తే ఈ బంద్ వ్యవహారం పెద్ద రచ్చ అయ్యేలానే ఉంది. ఎందుకంటే, జూన్ నుంచి వరుసగా పెద్ద సినిమాలు వచ్చేందుకు క్యూ కడుతున్నాయి. ఈ సమయంలో బంద్ అంటే నిర్మాతలు భారీగా లాస్ అవుతారు. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో చూడాలి. నిజంగా బంద్ అంటూ జరిగితే మాత్రం అందరికీ (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) నష్టమే.
Also Read- Naa Anveshana: రాత్రి కూడా వచ్చింది.. శ్రీముఖి బండారం బయటపెట్టేశాడు!
‘హరి హర వీరమల్లు’ మళ్లీ వాయిదా పడుతుందా?
జూన్‌లో విడుదలయ్యే సినిమాలలో అందరి కళ్లు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను జూన్ 12న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఫిక్సయ్యారు. ఈ మేరకు విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంతో మరోసారి ఈ సినిమా వాయిదా పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేలా అప్పుడే వార్తలు మొదలయ్యాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు