Harish Rao: బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. పాలన గాలికి వదిలి, సంక్షేమ పథకాలను అటకెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఎక్సర్ సైజ్ చేస్తున్న డిపార్ట్‌మెంట్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అని విమర్శించారు. మద్యం ధరల పెంపుపై ఆదివారం ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యంపై రాద్దాంతం చేసిన వాళ్లే, మద్యం ధరలు పెంచి వేల కోట్ల రాబడిని సమకూర్చుకోవాలనుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచి, పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నదన్నారు. ఒకవైపు మద్యం ధరలు పెంచడం, మరోవైపు విక్రయాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడంలోనే ప్రభుత్వం అంతర్యం స్పష్టమవుతున్నదన్నారు. ఎన్నికల ముందు సుద్ద పూస మాటలు, అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మద్యం ధరల పెంపు అని దుయ్యబట్టారు. దివాలా దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేసి రాష్ట్ర పరపతిని దిగజార్చారన్నారు. అనాలోచిత నిర్ణయాలు, దుందుడుకు చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రగతి రోజు రోజుకి క్షీణిస్తుండగా, ఆ లోటును భర్తీ చేసుకునేందుకు మద్యం ధరలు పెంచడం మీకే చెల్లిందన్నారు. అభయహస్తం 29వ పేజీలో.. ప్రస్తుత ఎక్సయిజ్ విధానాన్ని పునః పరిశీలించి పాలసీలో అవసరమైన సవరణలు చేస్తాం, బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం అన్నారన్నారు. మద్యం నియంత్రణలో మేనిఫెస్టోలో చెప్పిన ఒక్క హామీ అయినా ఇప్పటి వరకు అమలు చేశారా? అని నిలదీశారు.
Read Also-Kodali Nani: వంశీని చూసి కొడాలి నాని భయపడ్డారా.. వైద్యులే చెప్పారా?
నంబర్ వన్ చేస్తారా?
ఎక్సైజ్ విధానాన్ని పరిశీలించి, సవరణలు చేయడం అంటే ధరలు అడ్డగోలుగా పెంచడమేనా ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. ఇష్టారీతిన మద్యం ధరలు పెంచి, తాగుబోతుల ద్వారా ఖజానా నిలుపుకోవాలని చూస్తారా?రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసి, మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో తెలంగాణను నెంబర్ 1 చేస్తారా? మీరు చెబుతున్న తెలంగాణ రైజింగ్ అంటే ఇదేనా? అని నిలదీశారు. బెల్ట్ షాపులు మూస్తామని హామీ ఇచ్చి, గల్లి గల్లీలో బెల్ట్ షాపు తెరిచి తాగుబోతుల తెలంగాణగా మార్చే కుట్ర కాంగ్రెస్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఎక్సైజ్ ద్వారా ప్రజల నుంచి డబ్బును ముక్కు పిండి వసూలు చేస్తూ, మరోవైపు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో సరైన కేటాయింపులు చేయలేదన్నారు. ఇచ్చేది ఎగబడుతున్నారు.. ఉల్టా ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటున్నారు అన్నారు. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? ఇంకెన్ని సార్లు మద్యం ధరలు పెంచుతారు? ఇంకెన్ని కోట్లు ప్రజల నుంచి దండుకుంటారు?అని ధ్వజమెత్తారు. ఇది చాలదన్నట్లు సర్కారు గల్లా పెట్టె ఫుల్లుగా నింపుకోవాటానికి గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 కిలో మీటర్లకు ఒకటి చొప్పున 100 కు పైగా మైక్రో బ్రూవరీల ఏర్పాటు చేస్తున్నారట.. ఇంతకంటే దిగజారుడు, దిక్కుమాలిన పాలన ఎక్కడైనా ఉంటుందా? రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసి, భార్యా పిల్లలను రోడ్ల మీద పడేస్తారా? యువత బతుకులను ఆగం చేస్తారా? అసలు ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నది? అని నిలదీశారు.
Read Also- Naveen Chandra: నవీన్ చంద్ర రేంజ్ పెరిగింది.. ఒక్కరు కాదు, ఇద్దరితో ‘కరాలి’!
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
హైదరాబాద్‌లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరం అని హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నదన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నారు. ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారని, ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also- Gulzar House Fire Accident: ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్.. గుల్జార్ హౌస్‌లో ఇంత ఘోరం ఎలా జరిగింది?