BRS: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై బీఆర్ఎస్ ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వారి సమస్యలను సాధించాలని భావిస్తుంది. అందుకు సంబంధించిన ప్రణాళికలు సైతం రూపొందిస్తుంది. త్వరలోనే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్నసమస్యలపై గళమెత్తనున్నారు. ఇప్పటికే ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాత్ర పోషించిన ఉద్యోగసంఘ నేతలకు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. ఉద్యమంపై కార్యచరణ రూపొందించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా, లక్షల మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సైతం సమస్యలపై ఒత్తిడి చేస్తున్నాయి. అందుకు ప్రభుత్వం కమిటీసైతం వేసి సమస్యలను అధ్యయనం చేస్తుంది. అయితే మరింతగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే పలుదఫాలుగా ఉద్యోగసంఘాల నేతలు, రాష్ట్ర సాధన ఉద్యమసమయంలో కీలకంగా వ్యవహరించిన నేతలతోనూ భేటీ అయింది.
Also read: Ravi Teja: ఆ స్టార్ హీరోయిన్ తో ఘాటు లిప్ లాక్ కోసం రవితేజ అంత పని చేశాడా?
ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణను సైతం సిద్ధం చేసింది. ఈ నెల 19న ఉద్యోగ సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత జిల్లాల వారీగా పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ జిల్లాల్లో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ఉద్యోగులతోనూ భేటీ కానున్నారు. వారుపడుతున్న ఇబ్బందులపై క్షేత్రస్థాయిలో పోరాటానికి సన్నద్ధం చేయబోతున్నారు. జిల్లాల పర్యటనల టూర్ కు సంబంధించి షెడ్యూల్ ను సైతం ప్రకటించనున్నట్లు సమాచారం.
హరీష్ రావు ఇంట్లో కీలక భేటి
హైదరాబాద్ లోని కోకాపేటలో గల మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో శనివారం కీలక భేటి నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పకడ్బందీ కార్యాచరణ రూపొందించేందుకు సుధీర్ఘంగా చర్చించారు.
లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్ల డిమాండ్లపై స్పందించడం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యత అన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని తేటతెల్లమైందని, డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా త్వరలో పోరాట కార్యాచరణ వెల్లడిస్తామని ప్రకటించింది. మరోవైపు తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా క్షేత్ర స్థాయిలో భావసారూప్య సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది.
Also read: Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే?
గత 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కూడా సకాలంలో అందించకుండా సతాయించడం, ప్రశ్నించేందుకు ప్రయత్నం చేస్తున్న ఉద్యోగుల పైన వివిధ రకాలుగా ఒత్తిడి తేవడం వంటి అంశాలను పార్టీలోని మాజీ ఉద్యోగ సంఘాల, ఈ సమావేశానికి హాజరైన ఇతర నాయకులు కేటీఆర్, హరీష్ రావుల దృష్టికి తీసుకొచ్చారు.
విశ్రాంత ఉద్యోగులు, వృద్ధాప్యంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి పడుతున్న ఇబ్బందులపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల హక్కులు, ఆకాంక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొన్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని పార్టీ నాయకత్వం గుర్తించింది.
ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎల్లవేళలా ఉద్యోగుల ఆకాంక్షలు, హక్కుల పట్ల సానుభూతితో ఉంటుందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వం లక్షల మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుంటే వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న నేతలకు మద్దతుగా నిలవాలని, పార్టీలో ఉన్న ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రిటైర్డ్ నేతలను ఈ కార్యక్రమంలో కలుపుకోవాలని పార్టీ నాయకులు సూచించారు.
Also read: Rajanna Sircilla: ఇదేం పెళ్లిరా బాబూ.. ఇన్ని ట్విస్టులా.. సినిమాల్లోనూ చూడలే!
ప్రధాన ప్రతిపక్షంగా, ఉద్యోగులకు అండగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సహకరిస్తామని బీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు. పార్టీలో ఉన్న ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రిటైర్డ్ నేతలను కలుపుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం అని కేటీఆర్, హరీష్ రావు హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం, ఉద్యోగుల ఆకాంక్షల సాధన కోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ భేటీలో శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీఓస్ యూనియన్ మాజీ అధ్యక్షులు దేవీ ప్రసాద్, మామిండ్ల రాజేందర్, ఉపాధ్యాయ సంఘాల మాజీ నేతలు పాతూరు సుధాకర్‌రెడ్డి, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అస్తిత్వ పోరాటం
తెలంగాణ సంస్కృతి, అస్తిత్వ పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమ కాలం నాటి తరహాలో కవులు, కళాకారులు, రచయితలు, విభిన్న రంగాలకు చెందిన మేధావులను కలుపుకుని ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. హరీష్ రావు ఇంట్లో తెలంగాణ వికాస సమితికి చెందిన నేతలతోనూ భేటీ అయ్యారు. పలు అంశాలను చర్చించారు. ప్రజలు ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలపై పాటలు రాయాలని, ప్రజలను చైతన్యం చేయాలని కేటీఆర్, హరీష్ రావు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ వికాస సమితికి చెందిన ఎర్రోజు శ్రీనివాస్, కలకుంట్ల రంగాచారి, వేణుగోపాలస్వామి, విజయానంద్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.