YouTuber Jyoti Malhotra: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లతో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోనే కాకుండా దేశం లోపల కూడా భద్రతా బలగాలు అప్రమత్తయ్యాయి. పాక్ కు సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్న వారిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే హర్యానాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్ (Haryana based YouTuber) సహా ఆరుగురు భారతీయుల్ని (Indian nationals) అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు.
పాక్ ఐఎస్ఐ ఏజెంట్లుగా గుర్తింపు
దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పాక్ ఐఎస్‌ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
2023లో పాక్ పర్యటన
జ్యోతి.. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. 2023లో కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది పాక్ దేశంలో పర్యటించింది. ఈ క్రమంలోనే ఎవరికీ అనుమానం రాకుండా పాక్ అధికారులకు.. భారత్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. ఓ నెట్ వర్క్ లా ఏర్పడి ఆమెతో కలిసి అరెస్ట్ అయిన ఐదుగురు పనిచేస్తున్నట్లు తేల్చారు. ఈ ముఠా హర్యానా, పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు.
డానిష్ తో పరిచయం
ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్ (Danish)తో జ్యోతి మల్హోత్రాకు పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో అతడ్ని భారత్ బరిష్కరించింది. ఈ క్రమంలో డానిష్ గురించి సమాచారం సేకరిస్తున్న క్రమంలో.. యూట్యూబర్ జ్యోతితో అతడికి ఉన్న కనెక్షన్ బయటపడింది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్(PIO)లకు జ్యోతిని డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో జ్యోతి నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్లు తెలిసింది.
Also Read: Maheshwar Reddy On BRS: త్వరలో కవిత తిరుగుబాటు.. హరీష్‌కు రేవంత్ సపోర్ట్.. బీజేపీ నేత
పాక్ వ్యక్తితో రిలేషన్
అంతేకాదు జ్యోతి మెుబైల్ లో సేవ్ చేసుకున్న ‘జాట్ రంధావా’ అనే పేరు పాక్ చెందిన షకీర్ అలియాస్ రాణా షాబాజ్ అనే వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. అంతేకాదు ఓ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌తో ఆమె సన్నిహితంగా మెలుగుతున్నట్లు కూడా అధికారుల దర్యాప్తులో తేలింది. అతడితో కలిసి ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్లి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. తమ దర్యాప్తులో చేసిన తప్పులను జ్యోతి అంగీకరించినట్లు కూడా పేర్కొన్నారు.