Parvathipuram Issue
ఆంధ్రప్రదేశ్

TDP MLA: రాత్రిపూట మహిళా ఎమ్మార్వోకు టీడీపీ ఎమ్మెల్యే ఫోన్.. పచ్చి బూతులు.. సీఎం ఏం చేస్తున్నట్లు?

TDP MLA: అవును.. రాత్రిపూట మహిళా ఎమ్మార్వోకు టీడీపీ ఎమ్మెల్యే వాట్సాప్ కాల్ చేసి పచ్చి బూతులు తిట్టారు! ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు ఎమ్మార్వో కనిపించకుండా పోయారు. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో అసలేం జరుగుతోంది? ఎందుకీ ఎమ్మార్వోకు ఎమ్మెల్యే ఫోన్ చేశారు? అంటూ పెద్ద చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా నాడు టీడీపీ హయాంలోనూ ఇలాంటి ఘటనే జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని సామాన్య ప్రజలు సైతం తిట్టి పోస్తున్న పరిస్థితి. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన ఘటన ఏ రేంజిలో సంచలనమైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కూడా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. పైగా మహిళా ఎమ్మార్వో కావడంతో ఇదొక బర్నింగ్ టాపిక్ అయ్యింది.

అసలేం జరిగింది?
పార్వతీపురం టీడీపీ విజయచంద్ర గురువారం రాత్రి వాట్సాప్ నుంచి ఫోన్ చేసి విపరీతమైన పదజాలంతో, బూతు పదాలతో అసభ్యంగా, అసహ్యంగా తిట్టారని ఎమ్మార్వో జయలక్ష్మి ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా మాటలకు అందని పదజాలంతో తనను దూషించారని పార్వతీపురం ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంపై రెవెన్యూ అధికారులు పిలిపించి ఆరా తీయగా.. నిన్న రాత్రి 8.30 గంటల వరకూ సబ్‌ కలెక్టరు కార్యాలయంలోనే ఉన్న ఎమ్మార్వో అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు రంగంలోకి దిగిన సీఐ మురళీధర్‌ నేతృత్వంలోని పోలీసులు ఎమ్మార్వో ఆఫీసుకు చేరుకొని నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు కానీ.. ఆమె అక్కడికి రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే తాను తాను ఎలాంటి ఫోన్ కాల్స్ చేయలేదని, అసభ్య పదజాలంతో అసలే దూషించలేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. రైతుల నుంచి ఆమె లంచం తీసుకున్నారని, ఆ విషయం అడగడానికే తాను 50సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని వెల్లడించారు. చివరికి రాత్రి వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేసి తాను ఎమ్మార్వోను అని ఇష్టం వచ్చినట్లు చేస్తానని తనతోనే దురుసుగా మాట్లాడరని.. ఎమ్మార్వోపైనే ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. దీంతో అసలు ఏది నిజం? ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెబుతున్నారు? అనే విషయం తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఫిర్యాదుతో పార్వతీపురం మన్యం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. అయితే అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం మాత్రం బయటికి రావట్లేదు.

MLA VijayaChandran

ఎమ్మార్వోకు మతిస్థిమితం లేదా?
తనపై లేనిపోని ఆరోపణలు చేసిన ఎమ్మార్వోకు మతిస్థిమితం లేదని ఎమ్మెల్యే విజయచంద్ర చెప్పారు. ‘ పార్వతీపురం ఎమ్మార్వో అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. కుల ధ్రువీకరణ పత్రాల నుంచి భూ సర్వేలు వరకు అన్నింటికీ ఓ రేట్ ఫిక్స్ చేసి కలెక్షన్ చేస్తున్నారు. ములగ గ్రామస్తులు భూ సమస్యపై ఇప్పటికే ఎమ్మార్వోకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకొని ప్రస్తుతం రూ.2 లక్షలు లంచం ఇచ్చినట్లు రైతులు చెబుతున్నారు. డబ్బులు ఇచ్చినప్పటికీ పనిలో పురోగతి లేకపోవడంతో గ్రామస్తులు.. నాకు మొర పెట్టుకున్నారు. ఇదే విషయంపై నేను వివరాలు తెలుసుకునేందుకు ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఎమ్మార్వో పనితీరుపై ఆర్డీఓకు ఫిర్యాదు చేశాం. అభియోగాలపై వివరణ కోసం కాల్ చేస్తే ఎమ్మార్వో ఫోన్ కట్ చేశారు. గతంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహించిన పలు కార్యాలయాల్లో ఆమెపై చాలా అభియోగాలు ఉన్నాయి. మహిళా ఎమ్మార్వో కావడంతో ఆవిడపై ఎటువంటి అభియోగాలు వచ్చినప్పటికీ, దానిపై ఎక్కువగా స్పందించకుండా ఆగిపోయాను. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులతో పాటు, రెవెన్యూ శాఖ మంత్రికి కూడా ఎమ్మార్వో తీరుపై ఫిర్యాదు ఇచ్చాను’ అని ఎమ్మెల్యే మీడియాకు వెల్లడించారు. దీంతో అసలు ఎమ్మార్వో మతిస్థిమితంపై లేనిపోని అనుమానాలు వస్తున్నాయి.

Read Also- AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. పెద్ద తలకాయల అరెస్ట్

వివరణ ఇవ్వలేదేం?
పార్వతీపురం మండల పరిధిలో పలు సమస్యలపై ఎమ్మార్వోకు, వారి సిబ్బందికి డబ్బులు ఇచ్చినా, ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదని ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనిపై శనివారం ఆఫీసుకు వచ్చి మీడియా సమక్షంలో వివరణ ఇస్తానని జయలక్ష్మి సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ అంశంపై అటు పార్వతీపురం కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో ఎమ్మార్వో చర్చిస్తున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వద్ద జయలక్ష్మి కోసం టీడీపీ శ్రేణులు వేచి చూస్తున్నారు. ఎమ్మెల్యే బూతులు తిట్టారంటూ ఎమ్మార్వో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వాట్సాప్ కాల్ చేశారని డేట్, టైం కూడా ఫిర్యాదులో పేర్కొనడంతో పెద్ద చర్చే జరుగుతున్నది. ములగ గ్రామస్థుల వద్ద లంచం తీసుకున్న విషయంపై ఎమ్మార్వోను నిలదీస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ‘లంచాలు తీసుకోవద్దు’ అని ఎమ్మెల్యే సూచించడంతోనే ఎమ్మార్వో కేసు పెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కలెక్టర్‌తో మాట్లాడిన తర్వాత అటునుంచి అటే జయలక్ష్మి వెళ్ళిపోయారు. కనీసం ఫోన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఆఫీసుకు వస్తానని చెప్పి రాకపోవడంతో.. ఆమె కోసం వేచి చూస్తున్న టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే ఎమ్మార్వో మొదట్నుంచీ వైసీపీ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇంత దారుణమా?
మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఎమ్మార్వోను అసభ్య పదజాలంతో దూషించడం, అర్ధరాత్రి ఫోన్లు చేయడం వంటివి ఇదే మొదటిసారి అంటూ జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. పార్వతీపురం ఎమ్మెల్యే తీరు మొదటినుంచి వివాదాస్పదంగా ఉందని.. అధికారులపై ఇలాంటి తీరు అవమానకరం అని మజ్జి చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలపై విచారణ జరిపించి, ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మన్యం జిల్లా కేంద్రంలో ఏం జరగనుందో అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘటనలు మొదటిసారి కావడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనతో చింతమనేని ప్రభాకర్ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఇది మహిళల గౌరవాన్ని రక్షించే పార్టీయా? లేక అధికారంలోకి రాగానే అధికారిణులను వేధించే వారికో ఆశ్రయం కల్పించే పార్టీయా? అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారు? ఏం చర్యలు తీసుకుంటారు? అని టీడీపీలోనే చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఇలాంటి వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెట్టిన టీడీపీ అధినేతే వీటన్నింటికీ బాధ్యత వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇంత జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నట్లు? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. వైసీపీ ఆరోపిస్తున్నది.

Read Also- Vallabhaneni Vamsi: వంశీకి తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్