WE Hub Women Acceleration: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జేఆర్ఎసీ కన్వెన్షన్ లో WE Hub ఉమెన్ యాక్సిలరేషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. మహిళలు తయారు చేసిన వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై సీఎం మాట్లాడారు.
మహిళలే దేశానికి ఆదర్శమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు కావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ల ఎకనామి చేరుకోవాలంటే కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని పేర్కొన్నారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన ప్రోత్సాహాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రతీ ఆడ బిడ్డకు క్యూఆర్ కోడ్ తో కూడిన ఐడీ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. మహిళకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను ఆరోగ్య విషయాలను ప్రతీది అందులో పొందుపరుస్తామని తెలిపారు. వారి హెల్త్ కండిషన్ ఏంటి? గతంలో వారు తీసుకున్న ట్రీట్ మెంట్? వారికి అందించాల్సిన వైద్యం? వంటి వివరాలు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఒకసారి ఆస్పత్రిలో ఆ కార్డ్ చూపిస్తే.. మహిళకు సంబంధించిన అన్ని వివరాలు వైద్యులకు తెలుస్తాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు.. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకే అప్పగించినట్లు చెప్పారు. విద్యార్థుల యునిఫార్మ్ కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా అందించినట్లు రేవంత్ చెప్పారు. వ్యాపారాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని..పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలను చేసేందుకు సైతం మహిళా సంఘాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు చెప్పారు.
Also Read: Minster Seethakka: నేను నిత్య విద్యార్థిని.. నేర్చుకుంది పంచుకోవాలి.. సీతక్క పిలుపు
అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలు చేసేలా ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్ ను కేటాయించినట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటికి పెంచుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. మీ రేవంతన్నగా మహిళలకు ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు.