Minster Seethakka: యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం-2025.. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన వివిధ ఒలింపియాడ్ టాలెంట్ సెర్చ్ పరిక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై విద్యార్థులకు పురస్కారాలను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క (Minister Seethakka) మాట్లాడుతూ.. పిల్లల్లో విశ్లేషణాత్మక, సృజనాత్మక ఆలోచనల్ని పెంచడానికి యూనిఫైడ్ నిర్వహిస్తున్న ఒలింపియాడ్స్ పరీక్షలు వారి భవిష్యత్‌కు బలమైన పునాదులవుతాయని అన్నారు. పోటీ ప్రపంచంలో పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీసేందుకు యూనిఫైడ్ కౌన్సిల్ చేస్తున్న కృషిని అభినందించారు. జ్ఞానం నిరంతర ప్రవాహం లాంటిదని వ్యాఖ్యానించారు. నేర్చుకున్న విషయాలను ఇతరులకు పంచడమే అసలైన జ్ఞానమని మంత్రి స్పష్టం చేశారు. తానూ నిత్య విద్యార్థినేనని సీతక్క చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 250 మంది విద్యార్థులను సన్మానించి వారిపై మంత్రి ప్రశంసలు కురిపించారు.
యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ మెుత్తం ఐదు విభాగాల్లో పరీక్షలు నిర్వహించింది. జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (NSTSE), యునిఫైడ్ సైబర్ ఒలింపియాడ్ (UCO), యునిఫైడ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ (UIEO), యునిఫైడ్ ఇంటర్నేషనల్ మాథమేటిక్స్ ఒలింపియాడ్ (UIMO), యునిఫైడ్ ఇంటర్నేషనల్ జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్ (UIGKO) విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో జరిగిన ఈ పరీక్షల్లో మలేషియా, సింగపూర్, అమెరికా, ఇండోనేషియా సహా 30 పైగా దేశాల నుండి 10 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read: Ponnam Travel in TGSRTC: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్!
దేశం నలుమూలల నుండి ఎంపికైన 250 మందికి మంత్రి సీతక్క చేతుల మీదగా నిర్వాహకులు బహుమతులను అందజేశారు. టాప్ ర్యాంకర్స్‌కు గోల్డ్ మెడల్స్, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ పీసీలు, నగదు బహుమతులలను అందించారు. అలాగే, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలు, ఉపాధ్యాయులకు ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్కూల్ అవార్డ్స్’ కూడా అందజేశారు.