Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ మోహన్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ వచ్చింది. ఈ దాడి కేసులో ఏ71గా ఉన్న వంశీకి శుక్రవారం సాయంత్రం సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు కీలక కేసుల్లో మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ దక్కడంతో భారీ ఊరటే అని చెప్పుకోవచ్చు. కాగా, రెండు రోజుల క్రితం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరైంది. తాజాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. అయితే రెండు కేసుల్లో రిలీఫ్ దక్కినా వంశీ మాత్రం జైలుకే పరిమితం కానున్నారు. ఎందుకంటే.. నూజివీడు కోర్టు ఇచ్చిన రిమాండ్ కారణంగా జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం నాడే వంశీపై గన్నవరం పోలీసు స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది.
బెయిల్ వచ్చింది కానీ..
కాగా, వల్లభనేని వంశీపై కృష్ణాజిల్లా నూజివీడు కోర్టులో హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని వంశీపై కేసు నమోదు అయ్యింది. ఇదే కేసులో నూజివీడు కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేశారు. నాటి బాపులుపాడు ఎమ్మార్వో ఈ ఫిర్యాదు చేశారు. అయితే.. హనుమాన్ జంక్షన్ పోలీసుల పీటీ వారెంట్‌లో వల్లభనేని వంశీకి 14 రోజులు రిమాండ్ విధించింది. శనివారం నాడు వంశీని నూజివీడు కోర్టులో హజరుపరిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా.. ఇప్పటి వరకూ వంశీపై చాలా కేసులే నమోదు అయ్యాయి. ఆ కేసులన్నింటిలోనూ బెయిల్ కూడా వచ్చేసింది. అయితే ఒక్క నకిలీ పట్టాల కేసు మాత్రమే వంశీపై ప్రస్తుతం ఉన్నది. ఇందులోనూ బెయిల్ దక్కితే.. అప్పటి వరకూ ఎలాంటి కేసులు నమోదు కాకపోతే రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొత్త కేసు నమోదు అయితే మాత్రం వెంటనే పీటీ వారెంట్.. కోర్టులు, విచారణతోనే సరిపోతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
Read Also-Nara Lokesh: హెలికాప్టర్ లేకుంటే లోకేష్ అడుగు బయటపెట్టరా..?
ఇప్పటి వరకూ ఇలా..
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ కేసు, గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలపైనే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు చేపట్టింది. పలుమార్లు ముందస్తు బెయిల్ కొట్టిసిన జిల్లా, హైకోర్టు ధర్మాసనాలు.. ఆఖరికి మంగళవారం బెయిల్ దక్కింది. రూ.50 వేలతో పాటు రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే బెయిల్ వచ్చినా వంశీ విడుదల కష్టమే అయ్యింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ కేసులో మే-21 వరకు కోర్టు రిమాండ్ విధించినది. 22న టీడీపీ కార్యాలయం దాడి కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆశించారు. అయితే వారం రోజులు ముందుగానే బెయిల్ దక్కింది. కానీ, కొత్త కేసు నమోదు కావడంతో జైలు నుంచి విడుదలకు కష్టమైంది. కాగా, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటంతో బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
బరువు తగ్గిపోయారు..
శుక్రవారం వంశీని కలిసిన తర్వాత ఆయన భార్య పంకజశ్రీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ ఆరోగ్యం అసలు బాగోలేదని.. బరువు తగ్గిపోయారని కంటతడి పెట్టారు. యూరిన్ శాంపిల్స్‌లో కీటోన్ శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చాయని.. ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనగా ఉందని మీడియాకు చెప్పారు. మరోవైపు వంశీ తరఫు న్యాయవాదులు చిరంజీవి, విక్రమ్‌లు మాట్లాడుతూ వంశీపై అన్నీ అక్రమ కేసులే బనాయిస్తున్నారని వెల్లడించారు. ‘ ఇళ్ల పట్టాల కేసు నూటికి నూరుశాతం ఇవి ఫాల్స్ కేసు. పాత కేసును తిరగదోడి కావాలనే ఇబ్బంది పెడుతున్నారు. వంశీపై వేసిన పీటీ వారెంట్‌లో నిబంధనలు ఫాలో కాలేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎలక్షన్‌లో దొంగ పట్టాలు పంచితే ఎన్నికల కేసు అవుతుంది.. కానీ మామూలు కేసు ఎలా అవుతుంది? ఆ పంచిన దొంగ పట్టాలు ఎవరి దగ్గరున్నాయి? ఎవరికిచ్చారు? అనేది ఎవ్వరికీ తెలియదు.. ఒక్కరి దగ్గర కూడా పట్టాలు స్వాధీనం చేసుకోలేదు’ అని లాయర్లు చెప్పుకొచ్చారు.
Read Also-Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. రాజకీయాలకు గుడ్ బై?