Kishan Reddy – CM Revanth: కంపెనీల ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు కమిషన్లు తీసుకుంటారంటూ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి చేసినవని మంత్రి వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాల దూకుడు ఆగడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఏయే మంత్రి ఎంత కమిషన్లు తీసుకున్నారో దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి (Kishan Reddy).. మంత్రులు కమిషన్లు తీసుకోవడం కామన్ అని కొండా సురేఖ చెప్పడం బాధకరమని అన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆమె ఒప్పుకున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని ఈ అంశంపై డిమాండ్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఏయే శాఖ మంత్రి ఎంత తీసుకున్నారో బయటపెట్టేందుకు దర్యాప్తునకు ఆదేశించాలని పట్టుబట్టారు.
Also Read: CM Revanth: విద్యుత్ శాఖలో విప్లవాత్మక మార్పులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
మరోవైపు రేపు బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న తిరంగ యాత్రపైనా కిషన్ రెడ్డి మాట్లాడారు. త్రివిధ దళాలకు మద్దతుగా చేపడుతున్న ఈ యాత్రకు పార్టీలకతీతంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ యాత్ర చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో ముష్కరులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇందుకు ప్రతీగా పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను పేల్చివేసినట్లు చెప్పారు. తద్వారా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను మన సైనికులు విజయవంతంగా చేశారని చెప్పారు.