Minister Seethaka: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలని మంత్రి సీతక్క (Minister Seethaka) కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. లేని పక్షంలో కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి,క్రిమినల్ చర్యలు చేపడుతామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలతో రైతులకు జరిగిన నష్టంపై వరుస కథనాలకు మంత్రి స్పందించారు. హైదరాబాదులోని అగ్రికల్చర్ డైరెక్టరేట్ కార్యాలయంలో గురువారం కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కలెక్టర్ దివాకరా, విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయాధికారులు భేటీ అయ్యారు.
సుదీర్ఘంగా చర్చించారు. సీడ్ కంపెనీలు అనుసరిస్తున్న విధానంపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల తీరుపైమండిపడ్డారు. అధికారుల నుంచి సైతం వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపూర్ మండలాలతో పాటు కన్నాయిగుడెం, మరికొన్ని మండలాల్లో మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తనాలతో సేద్యం చేసి ఆదివాసీ రైతులు తీవ్రంగా నష్టపోయారని అధికారుల సర్వేల్లోనూ స్పష్టంగా తేలిందన్నారు.
వారందరికీ పరిహారం చెల్లించకపోతే ఆర్గనైజర్లు, మల్టీ నేషనల్ కంపెనీల జీఎంలపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పంట సేద్యం చేసిన రైతుల పంట క్షేత్రాల్లో క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులను సమన్వయం చేసి, నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన పంటలు.. రైతుల వివరాలను సేకరించి అందుకు అనుగుణంగా రైతులకు కంపెనీల ద్వారా నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ దివాకరా కు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ సైతం ఫీల్డ్ విజిట్ చేయాలని, వివరాలు సేకరించాలన్నారు.
నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని సహించేది లేదని, వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్లో పెడతామని మంత్రి స్పష్టం చేశారు. ఆదివాసి అమాయక రైతులను ఆసరా చేసుకుని కోట్లకు పడగలెత్తిన ఆర్గనైజర్లపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సీడ్ కంపెనీలకు లేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు.
Also Read: Fake visas Passports: ఉద్యోగాల పేరిట భారీ మోసం.. నకిలీ వీసాల గ్యాంగ్ అరెస్ట్..
నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం చెల్లించాల్సిందేనని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.విత్తన కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి కోసం ఇచ్చామంటే కుదరదని కంపెనీలను హెచ్చరించారు. ఆ లెక్కలు..ఈలెక్కలు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. రైతు ఒప్పుకుంటేనే పరిహారం చెల్లించాలని ఆదేశించారు. పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తే బాగుండదని తనదైనశైలీలో హెచ్చరించారు. మంగళవారం నుంచి గ్రామాలకు వెళ్లి పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి కంపెనీల ప్రతినిధులు సైతం ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలవారీగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయనున్నారు.
కీలక సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి డుమ్మా?
ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, ఏటూర్ నాగారం, తాడ్వాయి, మంగపేట, ఖమ్మం జిల్లాలోని చర్ల పినపాక, ఏన్కూరు, వరంగల్ జిల్లాలోని పరకాల, గూడెపహాడ్ మండలాల్లో సైతం మల్టీ నేషనల్ కంపెనీల మొక్కజొన్న విత్తనాలతో రైతులు సేద్యం చేసి పూర్తిగా నష్టపోయారు. దీనిపై స్పందించిన రాష్ట్ర రైతు కమిషన్ పర్యటించి రైతులకు పూర్తి పరిహారం చెల్లించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చింది. అయితే గురువారం జరిగిన సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాజరుకాలేదు.
Also Read: CM Revanth Reddy: సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ పుణ్య స్నానాలు
రైతులకు నష్టం వాటిల్లితే న్యాయం చేయాల్సింది పోయి సమావేశానికి కూడా హాజరు కాకపోవడంపై రైతుల్లో చర్చజరుగుతుంది. ముందస్తుగా అభివృద్ధి కార్యక్రమాలకు డేట్ ఫిక్స్ కావడంతోనే మంత్రి హాజరుకాలేదని సమాచారం. ములుగు కలెక్టర్ కార్యాలయంలో రైతులకు ఒకటిరెండ్రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని కలెక్టర్ దివాకర రైతులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు