BRS on Congress: అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర మహిళలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగి, తుడిచే పనులకు తెలంగాణ మహిళలను ఉపయోగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల స్వాభిమానాన్ని అందాల పోటీదారుల పాదాల చెంత ఉంచి సీఎం తెలంగాణ సంస్కృతిని అవమానించారన్నారు. రేవంత్ రెడ్డి చేసిన పని ఆయన బానిస మనస్తత్వానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీకి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పిచ్చి పనులను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ మహిళల కాళ్లు కడిగించిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్య రాష్ట్ర ప్రజల మనసును తీవ్రంగా బాధించిందన్నారు.
ప్రభుత్వ దిగజారుడు వైఖరి
మహిళా సాధికారత పేరిట ఇలాంటి పనులను చేయించడం ప్రభుత్వ దిగజారుడు వైఖరికి నిదర్శనం అన్నారు. రేవంత్ రెడ్డి చర్యలు తెలంగాణ సంప్రదాయాలను అవమానించడమే కాక, ప్రపంచం ముందు ఈ నేల ఖ్యాతిని మంటగలిపాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు తెలంగాణ స్ఫూర్తిని అర్థం చేసుకోలేని అజ్ఞానాన్ని, ఎవరినో సంతోషపెట్టడానికి ఈ నేల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే దాస్య మనస్తత్వాన్నే చూపిస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమం కేవలం రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే కాదు, ఇది మా ఆత్మగౌరవాన్ని చాటడానికి, మా సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు మా తెలంగాణ బిడ్డల సాధికారత కోసం జరిగిన మహాపోరాటం అన్న మహిళా నేతలు, రేవంత్ రెడ్డి ప్రవర్తనతో తెలంగాణ ప్రతిష్ట మసకబారుతుందన్నారు.
Also Read: Harish Rao on CM Revanth: శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్!
సీఎం సొంత నియోజకవర్గం లగచర్లలో దళిత గిరిజన ఆడబిడ్డలపై పోలీసులు అర్ధరాత్రి జరిపిన అకృత్యాలను సాటి మహిళలుగా తాము ఎన్నటికీ మరిచిపోలేమనీ, ఆ బాధిత మహిళలకు న్యాయం దక్కాలన్న ఉద్దేశ్యంతో ఢిల్లీలోని మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ వరకు వెళ్లి తాము పోరాడామని చెప్పారు. ఆ సంస్థలు తప్పుపట్టినా సీఎంకి ఇంకా బుద్ధి రాలేదన్నారు. వస్తుందన్న నమ్మకం రాష్ట్రంలో ఎవరికీ కూడా లేదన్నారు. గత 19 నెలలుగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి, రాష్ట్ర ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ, అడుగడుగునా తెలంగాణ స్వాభిమానాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళల సంక్షేమం కోసం గ్యారెంటీల పేరిట అనేక వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 ప్రతి మహిళకు ఇస్తామని, ప్రతి చదువుకునే విద్యార్థికి స్కూటీ ఇస్తామని రకరకాల హామీలిచ్చి, ఏడాదిన్నర గడిచినా ఈ హామీలను అమలు చేయడం లేదన్నారు. ఈ వాగ్దానాలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారనీ ఆరోపించారు.
ఆర్భాటాల కోసం రూ. 200 కోట్లు
ఓవైపు తెలంగాణ దివాలా తీసిందని, ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయిందని, అప్పు కోసం వెళ్తే దొంగను చూసినట్టు చూస్తున్నారని తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్న ముఖ్యమంత్రి మరోవైపు అందాల పోటీల కోసం ఏకంగా రూ.200 కోట్ల ఖర్చు చేయడం తెలంగాణ మహిళలను మాయమాటలతో మోసం చేయడమే అన్న సంగతి ప్రజలు తెలిసిందన్నారు. ఇలాంటి ఆర్భాటాల కోసం రూ. 200 కోట్లు వెచ్చించడం కంటే, ఆ మొత్తాన్ని మహిళల సంక్షేమం, విద్య, ఉపాధి కోసం ఉపయోగించి ఉంటే రాష్ట్ర ఆడబిడ్డలకు నిజమైన గౌరవం దక్కేది అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు “ఇది ఆత్మగౌరవానికి సంకేతంగా నిలవాలి” అని ఆకాంక్షించిన మీరు, ప్రతినిత్యం ఆడబిడ్డల ఆత్మాభిమానంతో ఆటలాడుతున్న ముఖ్యమంత్రిని ఇంకా వెనకేసుకోస్తారా అని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం, మహిళలపై ఉన్న చులకన భావాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రతిబింబిస్తున్నాయన్నారు.
Also Read: OG Movie: ఇంకేంటి మరి.. ఈసారి ముగించేద్దాం!