Kancha Gachibowli Land Case: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్.గవాయ్ ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల్లోని అడవులను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు అక్కడ ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారంటూ వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అడగటంతో విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసింది.
ఈలోపు కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. జస్టిస్ బీ.ఆర్.గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విచారించిన మొదటి కేసు ఇదే కావటం గమనార్హం. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పక్కనే ఉన్న కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవే అని కొంతకాలం క్రితం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం అక్కడ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టింది.
Alao Read: CM Revanth Reddy: ఆ నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయి? జల సౌధలో సీఎం సంచలన కామెంట్స్!
అయితే, అభివృద్ధి పేర ఈ భూముల్లో ఉన్న చెట్లను నరికి వేస్తున్నారని, ఫలితంగా పర్యావరణం దెబ్బ తినటంతోపాటు అక్కడ ఉన్న మూగ జీవాల మనుగడకు ప్రమాదం ఏర్పడిందంటూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు జరిపారు. వీరికి వేర్వేరు రాజకీయ పార్టీలు, సంస్థలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. గత విచారణ సందర్భంగా పర్యావరణ, వన్య ప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో తెలియచేస్తూ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని చెప్పింది.
కేసు విచారణలో ఉన్నపుడు ఒక్క చెట్టును కూడా నరక వద్దని స్పష్టం చేసింది. గురువారం దీనిపై ప్రధాన న్యాయమూర్తి బీ.ఆన్.గవాయ్ తో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేసింది. వివరాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారం డజన్ల కొద్ది బుల్ డోజర్లతో చెట్లను తొలగించారని, ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Tummala Nageswara Rao: హైవే పనుల వేగవంతం.. జూలై 2 లోగా పూర్తి చేయాలి.. మంత్రి ఆదేశం!
చెట్లను కూల్చటానికి ముందు పర్యావరన అనుమతులు తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారో తెలియ చేయాలన్నారు. కాగా, ప్రస్తుతం కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు జరగటం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కౌంటర్ దాఖలు చేయటానికి సమయం ఇవ్వాలని అడిగారు. ఈ క్రమంలో జూన్ 23వ తేదీ వరకు గడువు ఇస్తూ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు