Telangana Jagruti: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి యువ కవుల సమ్మేళనం దోహదం చేస్తుందని కవిత అన్నారు. తెలంగాణ తాత్వికతను, చరిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, సమాజంలో ఉండే సమిష్టితత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు తమ కలాలకు పదును పెట్టాలని కవిత పిలుపునిచ్చారు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ చరిత్రను, పోరాట స్పూర్తిని ఈ సమ్మేళనం ద్వారా కవులు చాటి చెప్పాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ నేల మీద అనేక గొప్ప కవులు, కవయిత్రులు తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించారని ఆ పరంపరంను కొనసాగించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని స్పష్టం చేశారు. గోల్కొండ కవుల సంచిక ద్వారా తెలంగాణ రచయితలు, కవులు, కవయిత్రుల ఆత్మగౌరవాన్ని సురవరం ప్రతాప్ రెడ్డి చాటిచెప్పారని గుర్తుచేశారు. ఆ స్పూర్తితో తాము ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు.
అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాహిత్యానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని కవిత విమర్శించారు. దాశరథి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అలాగే జానపదానికి గౌరవం దక్కడం కోసం జీవితాంతం కృషి చేసిన బిరుదురాజు శత జయంతికి రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. గొప్ప కవులు, కళాకారులు సమాజానికి చేసిన సేవలను ప్రభుత్వం విస్మరించడం తగదని సూచించారు.
Also Read: MP Bandi Sanjay: సీఎంకు బండి లేఖ.. ఫీజు బకాయిలపై ప్రశ్నలు.. ఆపై వార్నింగ్!
కాగా జూన్ 2న జరిగే యువ కవుల సమ్మేళనం పోటీలో పాల్గొన దలచిన కవులు, కవయిత్రులు 35 ఏళ్ల లోపువారు అయి ఉండాలి. తెలుగు, హిందీ ఇంగ్లీష్, ఉర్దూలలో కవితలు వినిపించవచ్చు. పోటీల్లో పాల్గొనేందుకు యువ కవులు తమ వివరాలను ఈ నెల 26 లోపు పంపాల్సి ఉంటుంది. kavitha.telangana@gmail.com కు మెయిల్ చేయాలి.