Vemulawada Temple
తెలంగాణ

Vemulawada: రాజన్న ఆలయం చుట్టూ రచ్చ.. ఎందుకిలా?

Vemulawada: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం (Temple) పునర్ నిర్మాణం, విస్తరణపై రచ్చ జరుగుతున్నది. ఆలయ పునర్ నిర్మాణ సమయంలో ఆలయం మూసివేస్తున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో విపక్షాలు ఆందోళన సైతం చేపట్టాయి. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నిత్యం స్వామివారికి పూజల కంకైర్యాలు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, అధికారులు ముందస్తుగా భక్తులకు విస్తరణపై, ప్రత్యామ్నాయంపై విస్తృత ప్రచారం చేయకపోవడంతోనే ఈ రచ్చకు కారణమని పలువురు మండిపడుతున్నారు. భక్తుల్లో అపోహలు కలుగడానికి ప్రభుత్వం మరోకారణం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆలయ పునర్ నిర్మాణంపై ఎలా ముందుకెళ్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత నవంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వేములవాడలో దేవాలయ విస్తరణకు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలిదశలో ఆలయ ప్రాంగణం, గర్భగుడి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా మొదటి విడతలో రూ.76 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే, దేవాలయ విస్తరణకు సంబంధించి శృంగేరి శంకర మఠం పీఠాధిపతి పర్యవేక్షణలోనే కొత్త నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే శృంగేరీ పీఠం వారితో సంప్రదింపులు జరిపిన అధికారులు తమ ప్రణాళికలను వారికి అందజేశారు. ఆ ప్లాన్‌కి పీఠాధిపతి పలు సూచనలు చేశారు. ఘన చరిత్ర ఉన్న ఈ దేవాలయ విస్తరణ పనులపై రాజకీయ వివాదం నెలకొన్నది. ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యేవరకు గుడిని మూసివేస్తారనే ప్రచారం నేపథ్యంలో విపక్ష నేతలు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సిరిసిల్ల బంద్ సైతం నిర్వహించాయి. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

అనుమానాలను నివృత్తి చేయడంలో జాప్యం

రాజన్న ఆలయ విస్తరణ చేసేటప్పుడు స్వామివారికి ఎక్కడ పూజలు నిర్వహిస్తారు? స్వామివారికి కోడె ముక్కులు ఎక్కడ చెల్లించాలి? స్వామివారికి భక్తులు పూజలు ఎక్కడ చేయాలనేదానిపై దేవాదాయశాఖ అధికారులు ప్రచారం చేయలేదు. భక్తుల అనుమానాలను నివృత్తి చేయలేదు. ఒక్కసారిగా ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నారని ఆలయం మూసివేస్తున్నారనే ప్రచారం ఊపందుకున్నది. దీంతో భక్తుల్లో అనుమానాలకు దారితీసింది. వారిపక్షాన విపక్ష పార్టీలు ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడుతున్నాయి. అదే ముందస్తుగా అలర్ట్ అయి ప్రచారం చేస్తే ఇప్పుడు రాజకీయాలకు తావుండేది కాదని పలువురు పేర్కొంటున్నారు.

Read Also- Samantha: ఈ ఫొటో చూస్తుంటే.. సమంత లైఫ్‌లోనూ ‘శుభం’ జరగబోతున్నట్టే ఉంది కదా!

భీమేశ్వరాలయంలో ఏర్పాట్లు

రాజన్న ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆలయానికి సమీపంలో ఉన్న భీమేశ్వరాలయంలో భక్తుల దర్శనంకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేద పాఠశాల ముందు స్థలంలో శృంగే రీ శంకర మఠం ఖాళీ స్థలాల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి అభిషేకాలు, నిత్య కల్యాణం మొదలైనవి నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లను చేసేందుకు రంగం సిద్దం చేశారు. కోడె మొక్కు సైతం చెల్లించే సౌకర్యం కల్పిస్తున్నారు. రాజన్న ఆలయానికి సమీపంలో ఇంకో ఆలయం.. బుద్దిపోచమ్మ గుడి ఉంది. అక్కడ స్వామివారికి పూజలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ ఆ గుడి వద్ద యాటకోతలు ఉండటంతో నిరాకరించినట్లు సమాచారం.భీమేశ్వర ఆలయంలో పూర్తిస్థాయిలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే ప్రధాన ఆలయ విస్తీర్ణ ప్రక్రియ ప్రారంభించనున్నారు. అయితే చాలా మంది మాత్రం రాజన్న ఆలయ సమీపంలోనే తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది.. లేకుంటే భీమేశ్వరాలయాన్ని ఫైనల్ చేస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రాజన్న ఆలయ విస్తీర్ణం విషయంలో అపోహలు వద్దు

వేములవాడ రాజరాజేశ్వరా స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం ఉన్న విస్తీర్ణంతో పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందజేయ లేకపోతున్నాం. జూన్ 15 నుంచి దేవస్థానం మూసి వేస్తున్నట్టు వస్తున్న వార్తలు సత్య దూరమైనవి. ప్రధాన ఆలయ విస్తీర్ణం, భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన సౌకర్యంకు సంబంధించిన వివరాలను అతి త్వరలో వెల్లడిస్తాం. శృంగేరి పీఠాధిపతి అనుమతులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాలు సూచనలు మేరకు ప్రధానా ఆలయాన్ని ఆగమశాస్త్రం బద్ధంగా విస్తీర్ణం పెంచబోతున్నాం. అందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడిస్తాం. ఆలయం అభివృద్ధి చేసేటప్పుడు కూడా పూర్తిస్థాయిలో స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఆలయ అభివృద్ధి విషయంలో అధికారిక ప్రకటన జారీ చేసే వరకు భక్తులు ఎవరు ఆందోళనకు గురి కావద్దు-ఆలయ అధికార, అర్చక బృందం

మంత్రి సురేఖ ఆరా

వేముల‌వాడ టెంపుల్ ఘ‌ట‌న‌పై మంత్రి సురేఖ బుధవారం ఆరా తీశారు. ఎండోమెంట్ క‌మిష‌న‌ర్‌, వేములవాడ ఆల‌య ఈవోల‌ను పూర్తి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. రాజన్న ఆలయ విస్తీర్ణం విషయంలో అపోహలు నెల‌కొన్నాయని ఆల‌య సిబ్బంది తెలిపారు. భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందజేసేందుకు ఆలయ విస్తీర్ణం పెంచాలనే చర్యలు తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు. ప్రధాన ఆలయ విస్తీర్ణం, భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన సౌకర్యానికి సంబంధించిన ప‌నులు చేప‌డుతున్నట్టు వెల్లడించారు. స్థానికంగా అన్నివ‌ర్గాల ప్రజ‌ల‌తో చ‌ర్చించి ముందుకు వెళ్లాలని, ఎక్కడా ఎలాంటి అనుమానాలు, ఇబ్బందులకు తావు ఇవ్వకుండా ముందుకు వెళ్లాలని అధికారుల‌కు మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఆలయ విస్తరణ పనుల్లో కీలకమైనవి

దేవాలయ ప్రధాన గర్బాలయం, మండప భాగాన్ని మెరుగుపరిచి దాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ కొత్త మండపాన్ని నిర్మించనున్నారు. పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ కొత్త నిర్మాణంతో గుడిని విస్తరణ చేపడతారు. ధర్మగుండం, గుడి చెరువు ప్రాశస్త్యం తగ్గకుండా మొత్తం 35 ఎకరాల పరిధిలో వివిధ నిర్మాణాలను చేపట్టనున్నారు. చాళక్యుల కాలం నాటి రాజన్న ఆలయ విస్తరణ కూడా అదే నిర్మాణ శైలిలో జరగనున్నది. ఇప్పుడున్న ప్రాకారాలను విస్తరించి మరో రెండు ప్రాకారాలను నిర్మిస్తారు. స్వామివారి కోనేరు, కళ్యాణ కట్ట, కోడెమొక్కులు చెల్లించే దారి, గుడికి దూరంగా ఉన్న అన్నదాన సత్రం, వసతి గృహాలు ఇలా అన్నీ ఒకే కాంప్లెక్స్‌లో ఉండే విధంగా కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న ఆలయం కొంత మేర ఆగ్నేయం దిశగా ఫేసింగ్ ఉంటుంది. గర్భాలయాన్ని సభామంటపాన్ని అదే దిశలో నిర్మించి మిగతా పనులను మాత్రం నేరుగా ఉండేలా సరిదిద్దాలని భావిస్తున్నట్టు సమాచారం. రెండెకరాల సువిశాల విస్తీర్ణంలో అన్నదాన సత్రాన్ని నిర్మించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ప్రస్తుత ఆలయం నాలుగు ఎకరాల్లో ఉండగా మరో 25 గుంటల మేర విస్తీర్ణాన్ని పెంచనున్నారు. రెండు ప్రాకారాలను సరిచేసి దేవాలయ మాడ వీధులను క్రమపద్దతిలో మార్చనున్నారు. దేవాలయ పరిసర ప్రాంతాలే కాకుండా గుడికి వచ్చే ప్రధాన రహదారిని కూడా వెడల్పు చేయనున్నారు.

Read Also- CM Revanth Reddy: ఆ నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయి? జల సౌధలో సీఎం సంచలన కామెంట్స్!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?