YS Jagan Padayatra: తెలుగు నేలపై ‘పాదయాత్ర’ అనేది ఎంతో పవర్‌ఫుల్. రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజల కష్టాలు, నష్టాలను ప్రత్యక్షంగా చూసేదే పాదయాత్ర. అందుకే పాదయాత్ర చేసిన నాయకులను తెలుగు ప్రజలు అందలమెక్కించారు కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరంతా ఒకేబాటలో నడిచి.. అధికారాన్ని అధిరోహించిన వారే. 2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ 3,648 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ యాత్రతోనే అధికారం చేపట్టారన్నది కూడా నిజమే. అయితే మరోసారి పాదయాత్ర బ్రహ్మాస్త్రాన్ని జగన్ ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇంతకీ జగన్ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏపీలో ఉందా? అసలు జగన్ బౌన్స్ బ్యాక్ అయ్యారా? ఈసారి పాదయాత్ర ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? ఎజెండా ఏమిటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
తొందరగానే బౌన్స్ బ్యాక్..!
2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి ప్రధాన కారణాలు పాదయాత్ర, నవరత్నాలు. అందుకే 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు వైసీపీ వశమయ్యాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేశామని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటారు. ఇన్ని చేసిన వైసీపీ వైనాట్ 175 అంటూ 2024 ఎన్నికలకు వెళ్లి బొక్కా బోర్లా పడిపోయింది. ఎంతలా అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేనంత. వైనాట్ 175 నుంచి క్రికెట్ టీమ్ 11కు పడిపోయింది. అసలు ఇంత దారుణ పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రజలు ఎందుకు ఇంత చేసినా ఆదరించలేదు? అనే విషయాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే పార్టీకి తెలిసొస్తున్నాయి. మరోవైపు వైసీపీ ఓడిపోయాక కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో అటు పార్టీ పరిస్థితి? ఇటు నేతల జంపింగ్‌లను చూసిన జనాలు అసలు వైసీపీ ఇప్పట్లో కోలుకుంటుందా? అనే అనుమానం వచ్చింది. అయితే ఆ అంచనాలు అన్నింటినీ తల్లకిందులు చేస్తూ త్వరగానే జగన్ బౌన్స్ బ్యాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎలాగంటే పార్టీని నేతలు వీడుతున్నా.. మరోవైపు నేతలు మొదలుకుని కార్యకర్తలను కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ క్యాడర్‌లో ఏమాత్రం నైతిక స్థైర్యం దెబ్బతినకుండా.. వైసీపీని బలోపేతం చేసే పనిలో అధినేత నిమగ్నమయ్యారు. వారానికి రెండు లేదా మూడు సార్లు కార్యకర్తలు, ద్వితియ శ్రేణితో పాటు పెద్ద తలకాయలతో భేటీలు నిర్వహిస్తున్నారు.
పాత సక్సెస్ ఫార్ములాకు పదునుపెట్టి..
ఇప్పటికే జగన్ 2.0 అంటూ పదే పదే చెబుతూ వస్తున్న అధినేత.. ఇప్పుడిక పాత సక్సెస్ ఫార్ములాకు ఇంకాస్త పదునుపెట్టి సరికొత్తగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీంతోనే పార్టీకి ఊపు, ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారట. ఇందుకు ‘పాదయాత్ర’ ఒక్కటే మార్గమని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే జగన్ రెడ్డే స్వయంగా 2027లో మళ్లీ పాదయాత్ర చేస్తానని కీలక ప్రకటన చేశారు. మరోవైపు పార్టీ నేతలు మీడియా ముందు.. కార్యకర్తలు సోషల్ మీడియాలో హడావుడి మొదలుపెట్టేశారు. అయితే ఈసారి తన రికార్డును తానే బ్రేక్ చేసుకోవాలని.. జగన్ 2.0లో 5వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. పాదయాత్రతోనే వైసీపీని రీఛార్జ్ చేయొచ్చని, మరీ ముఖ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేశారు. ఎవరి నిర్ణయం కోసమో ఎదురు చూడొద్దు. మీ జిల్లాలకు మీరే బాస్‌లు’ అంటూ ఇటీవలే జిల్లాల అధ్యక్షుల సమావేశంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఏడాది భారీగా ప్లీనరీ నిర్వహించి, ఆ తర్వాతే 2027లో 5వేల కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర 2.0 ఉండనుందని వైసీపీ స్పష్టం చేసింది.
అజెండా ఏంటి?
ఈ పాదయాత్ర మునుపటిలా కాకుండా ఈసారి ఓ రేంజిలో ఉండబోతోందని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండా ఉండనున్నాయని వైసీపీ చెబుతోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా హామీలు అమలు చేయకపోవడంతో.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర కంటే భిన్నంగా పాదయాత్ర ప్లాన్ షెడ్యూల్ కూడా ఉంటుందట. పాదయాత్ర కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ కూడా ఉండబోతోందట. ఇదంతా జగన్ తన సొంత ప్లాన్‌తో పాటు, అంశాల వారీగా అన్ని తానే చూసుకునేలా కార్యాచరణ చేస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు 3,648 కి.మీ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు విని, వాటి పరిష్కారంగా మేనిఫెస్టోను జగన్ తయారు చేశారు. ప్రజలకు ఏం కావాలి? ఏం చెబితే ప్రజలు ఓట్లేస్తారని ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారైంది. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో నీతి, నిజాయితీ, విశ్వసనీయత నూటికి నూరుశాతం ఉండాలన్నదే జగన్ సిద్ధాంతం. ‘ నేను చెప్పింది చేశాను.. ఇంకా ఏమైనా చేయాలంటే చెప్పండి’ అని కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, మంత్రులను గడపగడపకు పంపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డే అని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు.
పాదయాత్ర 2.0 కొత్తగా ఏముంటుంది?
ఈ పాదయాత్రలో కార్యకర్తలు, నేతలతో ప్రత్యేక సమావేశాలు ఉండబోతున్నాయట. ఎలాగంటే.. ప్రతి గ్రామంలో మొదట ప్రజలతో ‘రచ్చబండ’ కార్యక్రమం ఉంటుందని తెలిసింది. జనం చెప్పే సమస్యలను వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు, బ్లూ బుక్ మెయింటైన్ చేసి అందులో రాసుకుంటారని సమాచారం. మరోవైపు కార్యకర్తలతో ప్రత్యేకంగా మండల స్థాయిలో ప్రత్యేక సమావేశం ఉంటుందట. ఆ తర్వాత ద్వితియ శ్రేణి నేతలతో, ఆ తర్వాత కీలక, ఎమ్మెల్యే అభ్యర్థి, ఇంఛార్జ్‌లతో సమావేశాలు ఉంటాయని తెలుస్తున్నది. ఈ వరుస భేటీల్లో కార్యకర్తలు, నేతలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతాయట. అంతేకాదు పార్టీ బలోపేతం, స్థానికంగా పరిస్థితులపై వారి నుంచి వచ్చే సలహాలు, సూచనలను కూడా అధినేత స్వీకరిస్తారని సమాచారం.
జనం ఆదరిస్తారా?
అసలు ఈ పాదయాత్ర అవసరమా? అనే మాటకొస్తే.. సూపర్ సిక్స్‌తో వందల హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు ఇప్పటి వరకూ ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేసిందే లేదన్నది అధినేత భావనట. అందుకే 2027 వరకూ ప్రభుత్వంపై హామీల అమలు విషయంలో ఒత్తిడి తెచ్చి.. ఆ తర్వాతే పాదయాత్ర నిర్వహించాలని జగన్ ఫిక్స్ అయ్యారట. మరోవైపు.. ఇప్పటికే సభ్యత్వం, ఇన్సూరెన్ అని హడావుడి చేశారు.. ఇప్పుడేమో పాదయాత్ర అంటున్నారని కొంత క్యాడర్ నిష్టూరుస్తున్నది. ఎందుకంటే.. నిర్దిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని క్యాడర్‌ను సమాయత్తం చేసే పనిలో ఉండాలి అంతేకానీ.. ఇలా ముందస్తుగా లీక్‌లు ఇచ్చి ఎందుకు కన్ఫ్యూజన్ చేయడం? అంటూ సొంత పార్టీ కార్యకర్తలే నిట్టూరుస్తున్న పరిస్థితి. వాస్తవానికి పరిస్థితులు మునపటిలా ఏమాత్రం లేవు. ఇప్పుడు ప్రజలు ఈ యాత్రను ఆదరిస్తారా? అనేది కూడా పెద్ద డౌటే. మరి పాదయాత్ర 2.0 ఎంతవరకూ ఉండబోతోంది? ఏం చేయబోతున్నారు? అసలు పాదయాత్ర అయ్యే పనేనా? అనేది తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.
Read Also- YSRCP: వైసీపీకి ఊహించని ఝలక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ.. ట్విస్ట్ ఏమిటంటే..?