* చీటింగ్ కేసు.. పోలీసుల అదుపులో..
* పెట్టుబడుల పేరుతో ప్రముఖులకు వల
* వంద కోట్ల దాకా ఇచ్చిన మాజీ మంత్రి
* తేలు కుట్టిన దొంగల్లాగా బాధితులు
* ఇప్పుడైనా అందరూ బయటకొస్తారా?
- శ్రవణ్ రావు పాపం పండిందా?
- రూ.6.58 కోట్ల మోసం కేసులో అరెస్ట్
- ఇనుప ఖనిజం డీల్ అంటూ బురిడీ
- 2022 నుంచి 2023 మధ్య చెల్లింపులు
- మోసం చేయడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
- విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గతంలో ఏపీ నేత ఫ్యామిలీని బోల్తా కొట్టించిన ఘనుడు!
- పీటీ వారెంట్‌తో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తారా?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం
Sravan Rao: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సంచలనం రేపిన పేర్లలో శ్రవణ్ రావు ఒకరు. అప్పటిదాకా ఓ ఛానల్ ఎండీగా చలామణీ అయిన ఈయన, ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు తేలిందో అప్పటి నుంచి కష్టాలు క్యూ కట్టాయి. చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ (Arrest) అయ్యాడు. 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
అసలేంటీ కేసు?
ముడి ఇనుప ఖనిజ వ్యాపారానికి సంబంధించిన డీల్ కుదుర్చుతానని శ్రవణ్ కుమార్ రావు మరికొందరితో కలిసి అఖండ్ ఇన్ఫ్రాటేక్‌ను సంప్రదించారు. 2022లో శ్రవణ్ ఇన్ రితం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఇది జరిగింది. కర్ణాటకలో ఉన్న అకోర్ ఇండస్ట్రీస్‌కు చెల్లింపులు జరిపితే ముడి ఇనుప ఖనిజం టన్నుపై 300 రూపాయల లాభం వచ్చేలా చూస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో 2022 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ మధ్య రూ.6.58 కోట్ల దాకా చెల్లింపులు జరిగాయి. వాయిదాల పద్దతిలో డబ్బులు తీసుకున్న శ్రవణ్ రావు, మిగతా వారు ఒక్క టన్ను ఖనిజం కూడా సరఫరా చెయ్యలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు
అఖండ్ ఇన్ఫ్రాటేక్ సంస్థ డైరెక్టర్ ఆకర్శ్ కృష్ణ ఇటీవల శ్రవణ్ రావుపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 6.58 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్టు అందులో పేర్కొన్నాడు. పలుమార్లు శ్రవణ్ రావును ప్రశ్నించగా అప్పుడు ఇప్పుడు అంటూ సమయం దాటేశాడని పేర్కొన్నాడు. ఈ లోపు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడంతో విదేశాలకు పారి పారిపోయాడని చెప్పాడు. శ్రవణ్ భార్య, మిగతా వారిని అడిగితే కేవలం రూ.50 లక్షలు వాపసు చేసినట్టు తెలిపాడు. దీంతో సీసీఎస్ అధికారులు బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 316(5), 318(4), 3(5) ప్రకారం కేసులు నమోదు చేశారు. శ్రవణ్ రావును ప్రధాన నిందితుడగా పేర్కొంటూ, అతని భార్య స్వాతి రావు, వ్యాపార భాగస్వామి వేద మూర్తి, ఆకోర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఉమా మహేశ్వర్ రెడ్డిలను కూడా నిందితులుగా చేర్చారు.
Read Also- Yadagirigutta: కుదరని సయోధ్య.. వైటీడీ బోర్డుకు గ్రహణం!
14 రోజుల రిమాండ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో దారులన్నీ మూసుకుపోవడంతో ఇటీవలే శ్రవణ్ రావు నగరానికి చేరుకున్నాడు. పలుమార్లు పోలీసులు అతడిని విచారించారు. ఇదే క్రమంలో చీటింగ్ కేసుకు సంబంధించి మంగళవారం సీసీఎస్‌కు పిలిపించి విచారించారు. విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో శ్రవణ్ రావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్నాడు. అయితే, విచారణకు సహకరించకపోవడంతో ఆ బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో పీటీ వారెంట్ రిక్వెస్ట్‌తో అదుపులోకి తీసుకుని విచారిస్తారని తెలుస్తున్నది.
ఇలా ఇంకెన్ని చేశాడో..
ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు లీలలను ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం బయటపెట్టింది. గత మంత్రులతో అతనికి ఉన్న డీలింగ్స్‌పైనా కథనాలు ఇచ్చింది. ఇప్పుడు చీటింగ్ కేసు అరెస్ట్ నేపథ్యంలో అతను ప్రముఖులను పెట్టుబడుల పేరుతో ముంచిన మోసాలు ఇంకా ఎన్నో బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన నేత మైనింగ్‌లో పెట్టుబడుల కోసం వంద కోట్ల రూపాయల దాకా శ్రవణ్ రావుకు ఇచ్చినట్లు సమాచారం. ఇదేకాదు, గతంలో ఏపీకి చెందిన మాజీ మంత్రి కుటుంబాన్ని నమ్మించి ముంచేశాడని వారు పలువురి వద్ద ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. పెట్టుబడులు అంటూ, డబ్బులు డబుల్ చేస్తానంటూ శ్రవణ్ రావు ఇంకా చాలామంది ప్రముఖులను నమ్మించినట్టు సమాచారం. ఆ బాధితులంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తారా? లేదంటే తేలు కుట్టిన దొంగల్లాగా సైలెంట్ అయిపోతారా? అనేది చర్చనీయాంశమైంది.
Read Also- Congress Women’s wing: లిస్ట్ ఇచ్చినా నో యూజ్.. నామినేటెడ్ పదవులపై మహిళా నేతలు ఫైర్..