Yadagirigutta: తెలంగాణలో పేరు పొందిన ఆద్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం. ఆలయానికి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ బోర్డు(వైటీడీ) ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం.. మార్చి 18న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
అయితే దాదాపు రెండు నెలలు కావస్తుంది. అయినా బోర్డు చైర్మన్ , కమిటీ సభ్యులపై అడుగు ముందుకు పడలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రుల మధ్య పోరుతోనే బోర్డు ఏర్పాటు లో ఆలస్యమవుతుందని ప్రచారం జరుగుతుంది.
తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుపడుతుండటంతో కొలిక్కి రావడంలేదని, దీంతో ఆలయంలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని సమాచారం.
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ డెవలప్ మెంట్ బోర్డును తొలిసారి నియమిస్తున్నారు.
ఈ బోర్డుకు చైర్మన్ తోసహా 18 మంది సభ్యులు ఉంటారు. అయితే బోర్డులో చైర్మన్ పోస్టు కీలకం. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు సీనియర్ నేతలే కాదు.. జిల్లా రాజకీయాల్లోనూ కీరోల్ వీరిదే.
Also read: TG Private Schools: ఫీజుల నియంత్రణపై సర్కార్ ఫోకస్!
సామాజికంగాను బలమైన నేతలు కావడంతో చైర్మన్ ఎంపికపై పీటముడి వీడటం లేదు. తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని.. తనకంటే తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారని సమాచారం. ఎవరికి ఇచ్చినా కొత్త సమస్య వస్తుందని ప్రభుత్వం సైతం భావిస్తున్నట్లు తెలిసింది.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే ఇద్దరిలో ఎవరిని కాదన్నా పార్టీకి సైతం నష్టం జరుగుతుందని మిన్నకుండిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. బోర్డు ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగినా.. ఛైర్మన్ నియామకం ప్రభుత్వానికి పెద్దతలనొప్పిగా మారింది.
ఈ పదవికి ఎవరినీ ఎంపిక చేస్తే బాగుంటుందనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నది. ఇద్దరి మద్య కోల్డ్ వార్ జరుగుతుండటంతో ఎవరు సైతం జోక్యం చేసుకోవడానికి సైతం సాహసించడం లేదని సమాచారం. ఇద్దరిని సమన్వయం చేసేందుకు ఒకరిద్దరు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నా.. వెనక్కి తగ్గకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సైతం బోర్డు కమిటీలో అవకాశం కల్పించాలని పార్టీని అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
అయితే 18మంది సభ్యుల్లో ఏ వర్గానికి ఎంతమందికి అవకాశం ఇవ్వాలని, మహిళలకు ఎన్ని కేటాయించాలనేదానిపైనా స్పష్టత రాలేదని విశ్వసనీయ సమాచారం. జిల్లా మంత్రుల మధ్య సమన్వయలోపంతోనే వైటీడీ కి ముందడుగు పడటం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also read: LRS Extension: ఫలించని మంత్రం.. మూడోసారి ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు..
సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఇద్దరి సమన్వయం చేస్తేనే బోర్డు కు అడ్డంకులు తొలిగే అవకాశం ఉంది. లేకుంటే కష్టమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే చైర్మన్ తో పాటు రెండేళ్ల పదవికాలం ఉంది. అయితే సీఎం.. ఆ మంత్రులతో మాట్లాడి రెండేళ్ల చొప్పున అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తే బోర్డుకు అడ్డంకులు తొలగిపోనున్నాయి.
ఇదిలా ఉంటే ఇతర జిల్లా మంత్రులు సైతం బోర్డులో స్థానం కోసం పట్టుపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీ ప్రభుత్వం టీటీడీకి అవకాశం కల్పించినట్లుగా ఇతర జిల్లాకు సైతం బోర్డులో ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
15ఏళ్లుగా లేని పాలకమండలి
యాదగిరిగుట్ట పాలక మండలిని 2009 వరకు మాత్రమే ఏర్పాటు చేశారు. అప్పుడు మూడేళ్ల కాలపరిమితితో అనువంశిక ధర్మకర్తతో కలిపి 9 మంది సభ్యులతో నియమించారు. 2016 నుంచి వైటీడీఏ ఏర్పాటు చేసిన తర్వాత ఆలయ పునర్ నిర్మించేందుకు పాలకమండలితో పనిలేకుండా పోయింది.
ఇందుకు గాను గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినా పోటీ ఎక్కువ కావడంతో ఏర్పాటు చేయలేదు. దీంతో 15 ఏళ్లకు పైగా పాలక మండలి లేకుండానే ఆలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
అయితే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ బోర్డు కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఇక ఆలయ అభివృద్ధి జరుగుతుందని అంతా భావించారు. అయితే మంత్రులు తమ అనుచరులకు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతుండటంతో జాప్యం జరుగుతుంది.