Congress Women’s wing: కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్ అసంతృప్తితో ఉన్నది. తమకు నామినేటెడ్ పదవులు కేటాయించడం లేదని మహిళా నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు అర్హుల లిస్టును పీసీసీ తో పాటు ఢిల్లీలోని ఏఐసీసీకి పంపించామని, ఏడాదిన్నర దాటుతున్నా..ఒక్కరికీ పదవి ఇవ్వకపోవడం దారుణమని మహిళా నేతలు మండిపడుతున్నారు.
పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా? అంటూ తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు. పార్టీలో 20 ఏళ్లకు పై బడి నుంచి పనిచేస్తున్నా… పదవులు ఇవ్వకపోవడం విచిత్రంగా ఉన్నదని మహిళా వింగ్ నేతలు చెప్తున్నారు.
ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, పట్టించుకోవడం లేదని వివరిస్తున్నారు. ఇటు పీసీసీతో పాటు ఏఐసీసీలోనూ తమ సమస్యలను వివరించామని, కానీ ఇప్పటి వరకు స్పందన లేదని మహిళా నేతలు సీరియస్ అవుతున్నారు. స్టేట్ వింగ్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ మహిళా వింగ్ ల పరిస్థితి ఇలానే ఉన్నదని లీడర్లు స్పష్టం చేస్తున్నారు.
Also read: Yadagirigutta: కుదరని సయోధ్య.. వైటీడీ బోర్డుకు గ్రహణం!
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, మహిళలకు ప్రయారిటీ ఇవ్వకపోతే క్షేత్రస్థాయిలో వర్క్ ఎలా చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ మహిళా వింగ్ కు నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదని, దీంతో అందరిలోనూ అసంతృప్తి ఉన్నదని స్టేట్ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు పేర్కొన్నారు.
పనిచేసినోళ్లకు పదవులు ఇప్పించేందుకు తాను నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తున్నానని ఆమె వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్ లో జరిగిన మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటీవ్ బాడీ మీటింగ్ లో మహిళా నేతలు భగ్గు మన్నారు.
తమకు పదవులు ఇవ్వకపోతే ఎందుకు పనిచేయాలి? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సునీతరావు జోక్యం చేసుకొని అందరిని బుజ్జగించడం గమనార్హం. ఇదే అంశంపై త్వరలో పీసీసీ, ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు సునీతరావు ప్లాన్ చేస్తున్నారు.
పవర్ లోకి వచ్చేందుకు కీలక పాత్ర
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చేందుకు మహిళా వింగ్ క్రీయాశీలక పాత్ర పోషించింది. గత ప్రభుత్వం తప్పిదాలు, నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతో సక్సెస్ అయింది. ఎక్కడికక్కడ టీమ్ లుగా ఏర్పడి, బీఆర్ ఎస్ పార్టీ ఓటమి కొరకు కృషి చేసింది.
గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు చాలా మంది మహిళా నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు చొరవ చూపించారు. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా సమిష్టి గా పనిచేశారు. ఏఐసీసీ, పీసీసీ ఇచ్చినా కార్యక్రమాలన్నింటిని గ్రౌండ్ లోకి చేరవేర్చారు.
Also read: Phone Tapping Case: ఛీటింగ్ కేసు.. శ్రవణ్ రావు అరెస్ట్ !
సునీతరావు అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీలు, బంద్ లు వంటివి చేపట్టారు. తమ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో చాలా మంది మహిళా లీడర్లు దృఢంగా ఫైట్ చేశారు. కానీ పదవుల కేటాయింపులో వివక్ష చూపించడం సరికాదని మహిళా నేతలు నొక్కి చెప్తున్నారు.
ఇంటింటికీ ఫెయిల్యూర్స్.. భరోసా
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఇంటింటికీ చేర్చడంలో మహిళా నేతలు అద్భుతంగా పనిచేశారు. డిక్లరేషన్లు, పాంప్లెట్స్ రూపంలో గత ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ అన్నీ ప్రజలకు గుర్తుండేలా ఇంటింటికి తిరిగి మరీ వివరించారు.
దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తాం? ప్రజలకు జరిగే మంచి ఏమిటీ? అనే అంశాలను కూడా గతంలోనే ప్రజలకు తెలియజేశారు. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లో మహిళా వింగ్ క్రియాశీలక పాత్ర పోషించిందని అగ్రనేతలంతా గతంలో అభినందించారు.
మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని ప్రశంసలు కురిపించారు. కానీ పదవులు ఇవ్వడంలో మాత్రం మొండి చెయ్యి చూపించారని ఉమెన్ వింగ్ వెల్లడిస్తుంది.