Monsoon 2025: తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం (IMD) చల్లటి కబురు తెలిపింది. వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ, అంచనాల కంటే ముందుగానే ఈ ఏడాది భారతదేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్, నికోబార్ దీవులు, ఉత్తర అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకినట్లు ఐఎండీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో రానున్న రెండు రోజుల్లో నికోబార్ దీవుల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఈ వర్షాలు మరింతగా విస్తరించి, అండమాన్ నికోబార్ దీవుల మొత్తంతో పాటు దక్షిణ అరేబియా, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు చేరుకోనున్నాయి. ఇందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. కాగా, ఈనెల 27 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. అయితే 2009 మే- 23 తర్వాత రుతుపవనాలు ముందుగానే భారత భూభాగంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి.
ఎప్పుడు రావాలి?
సాధారణంగా నైరుతి రుతువపనాలు జూన్-01 నాటికి కేరళను తాకి, జులై 8 నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 17 నాటికి వాయువ్య భారతదేశం నుంచి తిరోగమనం ప్రారంభించి అక్టోబర్ 15 నాటికి పూర్తిగా రుతుపవనాలు ముగియనున్నాయి. కానీ, ఈ ఏడాది 2025, మే 27 నాటికే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకబోతున్నాయి. కాగా, జూన్ 12 వరకు నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరించనున్నాయి. అయితే నైరుతి రుతు పవనాల ప్రభావంతో మరో వారం రోజుల్లో దేశంలో ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది నిజంగా రైతులకు ఊరటనిచ్చే విషయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో దాదాపు 52 శాతం సాగుభూమి వర్షాధారంగానే ఉన్నది. వ్యవసాయ ఉత్పత్తిలో 40 శాతం ఈ భూముల నుంచే వస్తుందని విశ్లేషకులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి నైరుతి రుతుపవనాలే జీవనాధారం. అంతేకాదు, దేశంలోని జలాశయాలు నిండటానికి, విద్యుదుత్పత్తికి.. మరీ ముఖ్యంగా తాగునీటి అవసరాలు తీర్చడానికి నైరుతి వర్షాలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీలో వర్షం మొదలు..
కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీని తీవ్రమైన ఎండలు వేధిస్తున్నాయి. వడగాల్పులు, ఉక్కపోతతో జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ తరుణంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రాజధాని వాసులు వేడి నుంచి సేదదీరారు. మరోవైపు పలు ప్రాంతాల్లో బలమైన దుమ్ముతో ఈదురు గాలులు కూడా వీచాయి. దీంతో గురుగ్రామ్‌లో తుఫాన్ లాంటి పరిస్థితి కనిపించిందని నగర వాసులు చెబుతున్నారు. నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం కురుస్తున్నది.
Read Also- Kolikapudi: ఇంతకీ.. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేనా.. ఎంపీనా?