Indiramma Housing scheme: తరతరాలుగా సొంత ఇండ్లకు నోచుకోని ఆదిమ గిరిజన తెగలలోకి అతి బలహీన వర్గమైన చెంచుల సొంతింటి కలను నెరవేర్చబోతున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల అంశంపై మంగళవారం పొంగులేటి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, మున్ననూర్, ఏటూరునాగారం నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో సాచ్యురేషన్ పద్ధతిలో దాదాపు 10వేల చెంచు కుటుంబాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని గవర్ణర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అనేక సూచనలు చేశారని గుర్తుచేశారు. ఈనేపథ్యంలోనే చెంచులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని పొంగులేటి వివరించారు. అడవులను నమ్ముకుని జీవించే గిరిజనుల్లో చెంచులు ఒక జాతి అని. వీరు అడవుల్లో వేటాడటం, అటవీ ఫలసాయం సేకరించి అమ్ముకుని జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. వీరికి పక్కా ఇల్లు ఎలా ఉంటుందో ఊహకు అందని విషయమని, అలా అని ఆ అడవి ప్రాంతాల్ని వదలి వారు బతకలేరన్నారు.
Also Read: Komatireddy Rajagopal: ఎస్పీడీసీఎల్ సీఎండీతో కీలక భేటీ.. మునుగోడు విద్యుత్ సమస్యలపై దృష్టి!
అందుకే వారు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టంచేశారు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఆసిఫాబాద్ లో 3,551, బోధ్ లో 695, ఖానాపూర్ లో 1,802, సిర్పూర్ లో 311, ఆదిలాబాద్ లో 1430, బెల్లంపల్లిలో 326, భద్రాచలం ఐటీడీఏ పరిధి అశ్వరావుపేటలో 105, మున్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్ట్ లో భాగంగా అచ్చంపేటలో 518, మహబూబ్‌నగర్ లో 153, పరిగిలో 138, తాండూర్ లో 184.. చొప్పున మొత్తం 9,395 ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు.
ఈ ఏడాది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, అయితే ఐటీడీఏ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, అయితే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లకు 20 శాతం ఇండ్లను బఫర్ కింద పెడుతున్నట్లు చెప్పారు.
Also Read: Mahabubabad district: రైతులకు 21 వేల కోట్లతో రుణమాఫీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు!
జీహెచ్ఎంసీ పరిధిలో పేదలు ప్రస్తుతం ఉంటున్న వద్దే ఉండేందుకు ఇష్టపడుతున్నారని, నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదన్నారు. గత ప్రభుత్వం కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి హైదరాబాద్‌లో ఉన్న పేదలకు కేటాయిస్తే వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రాంతంలోనే జీ ప్లస్ త్రీ పద్ధతిలో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు