Operation Sindoor: ఆపరేషన్ సింధూర్, భారత్- పాక్ కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ షాకింగ్ ప్రకటన చేశారు. ఆదివారం తన నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయిన మోదీ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా దళాలకు మోదీ పలు కీలక సూచనలు, సలహాలు చేశారు. సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదంటూ పాకిస్థాన్‌కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ ఆపరేషన్ సింధూర్ ముగియలేదు.. గట్టిగా జవాబిస్తాం. ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదు. పాక్ నుంచి కాల్పులు జరిపితే భారత్ కూడా జరుపుతుంది. పాక్ దాడులు జరిపితే.. భారత్ కూడా ఏమాత్రం తగ్గకుండా దాడులకు దిగుతుంది. పాక్ ఒక్క తూటా పేల్చితే మీరు (త్రివిధ దళాలు) క్షిపణితో దాడి చేయండి. ఆపరేషన్ సింధూర్‌తో ప్రపంచానికి కొత్త సందేశం ఇచ్చాం. ప్రతి రౌండ్‌లో పాకిస్థాన్ మరింత దిగజారింది. ఉగ్రశిబిరాలను కాదు.. హెడ్‌క్వార్టర్లనే ధ్వంసం చేశాం. బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్‌లో ఉగ్రక్యాంప్‌లను మట్టిలో కలిపేశాం. ప్రతి రౌండ్‌లోనూ భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. వైమానిక దాడుల తర్వాత పాక్ చేతులెత్తేసింది. సింధూ ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టాం. ఉగ్రవాదం ఆగేవరకు ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుంది’ అని ప్రధాని మోదీ తేల్చి చెప్పేశారు.
తగ్గేదేలే..
‘ పీవోకేపైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే. పీవోకేను భారత్‌కు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదు. పీవోకే అంశంలో మధ్యవర్తులు మాకొద్దు. మేం ఎవరి మధ్యవర్తిత్వం కూడా కోరుకోవట్లేదు. పాకిస్తాన్ పీఓకే, ఉగ్రవాదులను అప్పగించాల్సిందే. మా సంయమనం బలహీనత కాదు. భద్రత విషయంలో రాజీ పడబోం’ అని ప్రధాని మోదీ తేల్చి చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు అయ్యింది కేవలం టీజర్ మాత్రమే.. ఇంకా ట్రైలర్, సినిమా చాలానే ఉందని స్పష్టం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఏ క్షణమైనా యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.
ఈ మూడు లక్ష్యాలే..
ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ మూడు లక్ష్యాలను సాధించిందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆ లక్ష్యాలను కూడా వివరించారు. మిట్టి మే మిలా దేంగే, బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్ క్యాంప్ కో మిట్టి మే మిలా దియా అనేది ‘సైనిక లక్ష్య’మని మోదీ అన్నారు. మరోవైపు.. సరిహద్దు దాటి ఉగ్రవాదానికి సంబంధించిన సింధు జల ఒప్పందం.. సరిహద్దు దాటి ఉగ్రవాదం ఆగిపోయే వరకు ఇది నిలిపివేయబడుతుందని ఇది ‘రాజకీయ లక్ష్య’మన్నారు. ఘుస్ కే మారేంగే, మేము వారి దేశంలో లోపలికి వెళ్లి దాడి చేశాం.. ఇందులో సక్సెస్ అయ్యామని ఇది ‘మానసిక లక్ష్య’మని మోదీ పేర్కొన్నారు.
విజయవంతంగా..
తమకు అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వహించామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. కచ్చితత్వం, నైపుణ్యంతో, ఎంతో సావధానంగా, జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించామని ఎయిర్‌ఫోర్స్ స్పష్టం చేసింది. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ఆపరేషన్ నిర్వహించాం. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు. తప్పుడు సమాచారాన్ని దేశ ప్రజలెవరూ నమ్మొద్దు’ అని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది.
ప్రతీకారం తీర్చుకున్నాం..
ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పాక్ ఉగ్రవాదులు పహల్గాంలో భారతీయులను చంపి, ఆడవారి సింధూరాలను తుడిచారని మండిపడ్డారు. అందుకే ఆపరేషన్ సింధూర్‌ను మొదలుపెట్టి ఉగ్రవాదులను అంతం చేశామన్నారు. పాకిస్థాన్ ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదులపైనే దాడి చేశామని స్పష్టం చేశారు. కానీ, పాకిస్థాన్ భారత్ ప్రజల మీద దాడి చేసిందని.. ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పి కొట్టిందని రాజ్‌నాథ్ వెల్లడించారు. ‘ ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్యే కాదు. ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనం. ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. భారత సైన్యం పరాక్రమాన్ని ప్రదర్శించింది. పాక్ సైనిక ప్రధాన కేంద్రమున్న రావల్పిండిలోనూ గర్జించింది. పహల్గాం బాధితులకు న్యాయం చేకూరింది. పాక్ ప్రజలపై భారత్ దాడి చేయలేదు’ అని రాజ్‌నాథ్ తెలిపారు.