India Pak Ceasefire: ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసిపోయింది. ఇరుదేశాలకు పెద్దన్నగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆపేశారు! శుక్రవారం రాత్రంతా భారత్-పాకిస్తాన్‌లతో ట్రంప్ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలా రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించడంతో తక్షణ సీజ్‌ఫైర్‌కు భారత్, పాక్ అంగీకరించాయి. మరోవైపు భారత విదేశాంగ కార్యదర్శి సైతం కాల్పుల విరమణపై కీలక ప్రకటన చేశారు. ఈ రెండు ప్రకటన వెలువడ్డాక భారత త్రివిధ దళాలు మీడియా మీట్ నిర్వహించి సంచలన ప్రకటన చేశాయి. మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలు ముందుకు రావడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ స్వాగతించారు.
మేం ఎప్పుడూ సిద్ధమే..
దేశాన్ని కాపాడేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధమేనని కల్నల్ సోఫియా ఖురేషి ప్రకటించారు. ‘ ఇప్పటి వరకూ భారత్ చేసిన దాడులతో పాక్ సైన్యం తీవ్రంగా నష్టపోయింది. ఎస్-400ను ధ్వంసం చేసినట్టు పాక్ తప్పుడు ప్రచారం చేసింది. పాక్ చెప్పినట్టు భారత ఆర్మీకి ఎక్కడా, ఎలాంటి నష్టం జరగలేదు. భారత సైన్యం పాక్ ఆర్మీ బేస్‌లను ధ్వంసం చేసింది. దీంతో పాక్ ఆర్మీకి భారీగా నష్టం వాటిల్లింది. దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగి పాక్ తీవ్రంగా నష్టపోయింది. ఎల్‌ఓసీ దగ్గర పాక్ తీవ్రంగా నష్టపోయింది. భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది’ అని సోఫియా స్పష్టం చేశారు.
బాధ్యతగా ఉన్నాం..
కొన్ని రోజుల క్రితం జరిగిన విషాదకర సంఘటనల తర్వాత భారత ప్రతిస్పందనలు సంయమనంతో, బాధ్యతాయుతంగా ఉన్నాయని ఇండియన్ నేవీ కెప్టెన్ రఘు నాయర్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూనే, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి భారత సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందన్నారు. దేశ రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడానికి త్రివిధ దళాలు సదా సిద్ధంగానే ఉన్నాయని నాయర్ పేర్కొన్నారు.

పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి పాల్పడిందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆరోపించారు. పోరాట సమయంలో భారత దళాలు మసీదులను లక్ష్యంగా చేసుకున్నాయన్న పాకిస్థానీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాము అన్ని మతాల ప్రార్థనా స్థలాలను గౌరవిస్తామని, భారత సాయుధ దళాలు ఏ మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయలేని వ్యోమికా స్పష్టం చేశారు. ఈ ఘర్షణల వల్ల పాకిస్థాన్ భూభాగంలో, వారి వైమానిక స్థావరాలు.. సైనిక మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లిందని తెలిపారు.
పాక్ అభ్యర్థన మేరకే..
కాల్పుల విరమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ‘ పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ జరిగింది. ఈనెల 12న మళ్లీ చర్చలు జరుగుతాయి. ఉగ్రవాదంపై పోరాడుతున్న కేంద్రానికి అండగా ఉండాలి. మరణించిన సైనికుల కుటుంబాలకు తోడుగా ఉందాం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
శుభవార్త చెప్పారు..
పాక్-భారత్ కాల్పుల విరమణపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నడుమ ఓ శుభవార్త రావడం మంచి పరిణామం అన్నారు. భారత్- పాకిస్థాన్ విషయంలో జోక్యం చేసుకోమని అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ తనను చెప్పారన్నారు. తాను రిపబ్లికన్లు, డెమొక్రటిక్ నేతలను కలిసి ఉన్నానని, అలాగే పాకిస్థాన్, భారత్ నేతలతోనూ నేను టచ్‌లో ఉన్నట్లు స్పష్టం చేశారు. నిన్నటి వరకూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాకిస్థాన్ విషయంలో జోక్యం చేసుకోమని చెప్పారు కానీ, తాను ఆశలను వదులుకోలేదన్నారు. ఉద్రిక్తతలు మొదలైనప్పట్నుంచీ రాత్రింబవళ్లు ప్రార్థిస్తూనే ఉన్నానని, యుద్ధం ద్వారా నష్టమే కానీ ఎలాంటి లాభం లేదన్నారు. అలాగని టెర్రరిస్టులు దాడి చేస్తే ఊరుకోకూడదని తెలిపారు. శాంతి కోరుకునే వాళ్లంతా మే 24న జింఖానా మైదానంలో జరిగే మీటింగ్‌కు రావాలని పాల్ పిలుపునిచ్చారు.