India Pak War: అవును.. భారత్ ఆర్మీ దెబ్బకు పాక్ చేతులెత్తేసింది. ఇక దాడులు, అంతకుమించి యుద్ధం వద్దు బాబోయ్ అంటూ తోక ముడిచేసింది. శనివారం 3.35 గంటల ప్రాంతంలో నేరుగా పాక్ డీజీఎంవో.. భారత్ డీజీఎంవోకి ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరారు. దీంతో కాల్పుల విరమణను ఇరు దేశాలు ధ్రువీకరించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. ‘ భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకరించాం. మధ్యాహ్నం 3:35 గంటలకు పాక్ డీజీఎంవో.. భారత డీజీఎంవోకు ఫోన్ చేశారు. ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి రానుంది. మే-12న సాయంత్రం 5 గంటలకు డీజీఎంవోల మధ్య మళ్లీ తదుపరి చర్చలు జరుగుతాయి’ అని విక్రమ్ మిస్రీ అధికారిక ప్రకటన చేశారు. మరోవైపు విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా కాల్పుల విరమణపై అంగీకరించామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఆగదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. ఇక ముందు కూడా ఉగ్రమూకలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
ట్రంప్ పెద్దన్న పాత్ర..
ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసినట్టే. అగ్రరాజ్యం అధిపతి డోనాల్డ్ ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. శనివారం సాయంత్రం భారత్-పాక్ యుద్ధంపై సోషల్ మీడియా వేదికగా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ‘ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. తక్షణ సీజ్‌ఫైర్‌కు భారత్, పాక్ అంగీకరించాయి. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించాం. రాత్రంతా భారత్-పాకిస్తాన్‌లతో చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలకు నా అభినందనలు’ అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేసిన కాసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. ఇండియా- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశారు. భారత్ ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవాల్, అసిమ్ మాలిక్‌లతో సుదీర్ఘ సమావేశం జరిగిందని వెల్లడించారు. ఈ భేటీలో తాను కూడా పాల్గొన్నానని రుబియో తెలిపారు. అటు ట్రంప్.. ఇటు రుబియో ప్రకటనల తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా ముందుకొచ్చి కాల్పుల విరమణ విషయం వెల్లడించారు.
Read Also-India Vs Pak War: ముగిసిన ఇండియా-పాక్ మధ్య యుద్ధం.. సంచలన ప్రకటన
ఇకపై తగ్గేదేలే..
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత్ ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నది. శనివారం సాయంత్రం ఉగ్రవాదులు, ఉగ్రమూకలకు మద్దతు పలికే వారికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్ర చర్యనైనా దేశంపై యుద్ధంగా పరిగణించాలని, దానికి తగువిధంగా స్పందించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇదొక కీలక నిర్ణయమే అని చెప్పుకోవచ్చు. కాగా, శనివారం ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతోపాటు.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులను నిశితంగా చర్చించారు. అనంతరం ప్రభుత్వ వర్గాలు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రకటన చేసిన గంట వ్యవధిలోనే డోనాల్ ట్రంప్ సోషల్ మీడియాలో కాల్పుల విరమణపై కీలక అనౌన్స్‌మెంట్ చేశారు.