S-400 Sudarshan Chakra: ఆపరేషన్ సిందూర్ తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోంది. భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన పాక్ ప్రధాని.. ఇందుకు అనుగుణంగా భారత్ పైకి యుద్ధ విమానాలు, మిసైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఏ ఒక్కటి భారత్ ను డ్యామేజ్ చేయలేకపోవడం గమనార్హం. మన దేశానికి చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. ఎస్ – 400 సుదర్శన్ చక్ర.. పాక్ ప్రయోగించిన వాటిని సమర్థవంతంగా అడ్డుకొని నేలకూల్చింది. దేశాన్ని పెను ప్రమాదం నుంచి కాపాడింది. దీంతో ఒక్కసారిగా ఎస్ – 400 సుదర్శన్ చక్ర పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. దాని శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకునేందుకు భారతీయులు ఆసక్తిక కనబరుస్తున్నారు. కాబట్టి ఎస్ – 400 ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.
రష్యా నుంచి దిగుమతి..
S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. రష్యా తయారు చేసిన అత్యంత అధునాతన లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ (SAM) సిస్టమ్‌లలో ఒకటి. భారత్ తో ఉన్న సన్నిహిత, ద్వైపాక్షిక, స్నేహపూర్వక సంబంధాల రిత్యా భారత్ కు ఈ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను అందించేందుకు రష్యా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా 2018లో ఈ డిఫెన్స్ సిస్టమ్ కోసం భారత్ – రష్యాల మధ్య 5.43 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 35,000 కోట్లు) ఒప్పందం కుదిరింది. మెుత్తం ఐదు స్క్వాడ్రన్‌లకు గాను 2021, 2022, 2023 సంవత్సరాల్లో రష్యా మూడింటిని డెలివరీ చేసింది. మరొకటి ఈ ఏడాది చివరిలో.. ఐదవది 2025 నాటికి భారత్ కు రానుంది.
కీలక స్థానాల్లో ఏర్పాటు..
S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు నాటో దేశాలను సైతం ఎదిరించిన ఘనత ఉంది. రష్యా నుంచి దిగుమతి అయిన S-400 స్క్వాడ్రన్‌లలో మూడింటిని భద్రతా పరంగా ఎంతో కీలకమైన మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. పఠాన్‌కోట్ (జమ్మూ & కాశ్మీర్, పంజాబ్ రక్షణ కోసం), రాజస్థాన్ – గుజరాత్‌లో స్ట్రాటజిక్ ప్రాంతాలు, సిలిగురి కారిడార్ (నార్త్ ఈస్ట్ రక్షణ కోసం) వీటిని మోహరించి పెట్టింది. ప్రతి స్క్వాడ్రన్ లో రెండు బ్యాటరీలు, ప్రతీ బ్యాటరీలో 6 లాంచర్లు ఉన్నాయి. వీటితో పాటు రాడార్ కంట్రోల్ సెంటర్, 128 మిసైల్స్ ఒక స్క్వాడ్రన్ లో ఉంటాయి.
S-400 ప్రధాన సామర్థ్యాలు
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. విస్తృతమైన రేంజ్ ను కలిగి ఉంది. 600 కి.మీల దూరంలోని లక్ష్యాలను సైతం ఇది గుర్తించగలదు. 400 కిలోమీటర్ల వరకూ మిసైళ్లను ప్రయోగించి శత్రు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు (F-16, F-35, సుఖోయ్-30), క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లు, ఇతర హానికర వాయుసేన వస్తువులను నాశనం చేయగలదు. దీని రియాక్షన్ టైమ్ కూడా చాల తక్కువగానే ఉంటుంది. 5-10 సెకన్లలో కదులతున్న టార్గెట్ ను లాక్ చేసి నేలకూల్చకూలదు.
Also Read: Pakistan Financial Crisis: చిల్లిగవ్వ లేక దివాలా దిశగా పాక్.. దేహీ అంటూ భిక్షాటన.. పరారీలో ప్రధాని!
నాలుగు రకాల క్షిపణులు
S-400 ట్రయంఫ్ మెుత్తం నాలుగు రకాల క్షిపణులను కలిగి ఉంటుంది. వాటి ఛేదన పరిధి ఆధారంగా వాటిని విభజించారు. 40N6E (400 కి.మీ. పరిధి), 48N6DM (250 కి.మీ), 9M96E2 (120 కి.మీ.) 9M96E (40 కి.మీ.) పేరుతో పిలిచే ప్రతి స్క్వాడ్రన్ వాహనంలో ఉంటాయి. మరోవైపు S-400 డిఫెన్స్ సిస్టమ్.. ఒకే సమయంలో 80 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. 36 టార్గెట్లను ఒకేసారి ఛేదించగలదు. అంతేకాదు ఆకాశంలో 30 మీటర్ల నుండి 30-35 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తున్న లక్ష్యాలను నాశనం చేయగలదు. డ్రోన్స్ దగ్గర నుంచి బాలిస్టిక్స్ క్షిపణుల వరకూ దేనినైనా ఈ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోగలదు.