Maoists Letter: మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టిన సంగతి తెలిసిందే. చత్తీస్ గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో వందలాది మంది నక్సల్స్ ఉన్నారన్న పక్కా సమాచారంతో కొన్ని రోజుల క్రితం కేంద్ర బలగాలు.. ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా కర్రెగుట్టల్లో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. అటు పలువురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే మానవతా కోణంలో ఆలోచించి ఈ ఆపరేషన్ ను నిలిపివేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం సహా పలువురు రాజకీయ ప్రముఖులు కోరుతున్నారు. ఈ క్రమంలో నక్సల్స్ నుంచి ఓ సంచలన లేఖ విడుదలైంది.
కాల్పుల విరమణకు అంగీకారం!
నక్సల్ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ బయటకొచ్చింది. ఈ లేఖ ప్రకారం.. ఆదివాసి గిరిజనులను హననం చేసే విధంగా కేంద్ర, చత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వ భద్రత బలగాలు ఈ ‘ఆపరేషన్ కగార్’ చేపట్టాయని తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు, మెజారిటీ రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నారని నక్సల్స్ అన్నారు. ఈ ఆపరేషన్ ను నిలిపివేయాలని మావోయిస్టులు రాస్తున్న లేఖలకు వారి నుంచి సానుకూల స్పందన రావడంతో కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని మావోయిస్టు అధికార ప్రతినిధి లేఖలో వెల్లడించారు. ఆరు నెలల పాటు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
శాంతి చర్చల కమిటీ
మావోయిస్టు పార్టీకి ప్రభుత్వానికి మధ్య చర్చలు జరపాలన్న డిమాండ్ తొలుత తెలుగు రాష్ట్రాల్లో మెుదలైనట్లు నక్సల్స్ తాజా లేఖలో పేర్కొన్నారు. దానిలో భాగంగా అప్పట్లో శాంతి చర్చల కమిటీ ఏర్పడిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కొన్ని వందల సంఘాలు, వ్యక్తులు, ప్రముఖులు, పార్టీలు సైతం ఇదే డిమాండ్ ను చేస్తున్నట్లు లేఖలో గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ సూచించిన చర్చల అంశాన్ని అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని లేఖలో వెల్లడించారు.
కేసీఆర్, రేవంత్ గురించి ప్రస్తావన
ఆపరేషన్ కగార్ ను రద్దుచేసి చర్చలు జరపాలని సీపీఐ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని నక్సల్స్ లేఖలో గుర్తుచేశారు. ఆ కార్యక్రమాల్లో మిగతా వామపక్ష పార్టీలన్నీ పాల్గొంటున్నాయని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ సైతం తమ రజోత్సవ సభలు శాంతి చర్చలు జరపాలని తీర్మానం చేసిందని అన్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్ సైతం ఇదే డిమాండ్ ను ప్రస్తావించారని నక్సల్స్ లేఖలో పేర్కొన్నారు.
Also Read: Civil War in Pakistan: పాక్‌లో అంతర్యుద్ధం.. రోడ్లపైకి ఇమ్రాన్ సపోర్టర్స్ .. తాటతీస్తున్న బలూచ్ రెబల్స్!
వారి సపోర్ట్ పై హర్షం
ఇంతమంది వ్యక్తులు, ప్రముఖులు, మేధావులు మావోయిస్టులకు సపోర్ట్ చేయడం హర్షిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. అయితే చర్చల ప్రక్రియ అనేది రాష్ట్రంలో, దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం గా అర్థం చేసుకోవాలని కేంద్రానికి నక్సల్స్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రయత్నాలకు మావోయిస్టు పార్టీ నుండి సానుకూలతను కలిగించేందుకు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నట్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. అయితే దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.