TG BJP Leaders: తెలంగాణ కమలనాథులు కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతున్నారా? కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కౌంటర్ అటాక్ చేయలేకపోతున్నారా? ఏ కార్యక్రమం చేయాలన్నా ఢిల్లీ పెద్దల ఆదేశాల కోసం ఎదురుచూడాల్సిందేనా? అంటే ఊ అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలపై భారతసైన్యం విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. తెలంగాణ ప్రభుత్వం భారతసైన్యాన్ని అభినందిస్తూ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు దేశమంతా మాక్ డ్రిల్ చేపట్టగా ఆ క్రెడిత్ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కడం గమనార్హం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మాక్ డ్రిల్ ను స్వయంగా పర్యవేక్షించారు. కాగా బీజేపీ నేతలు ఏం చేయాలో తెలియక దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నేతలు దీన్ని క్యాష్ చేసుకోవడంలో విఫలమయ్యారు.
ఢిల్లీ అధిష్టానం వైపు ఎదురుచూపులు
తెలంగాణ బీజేపీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ అధిష్టానం వైపు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కేడర్ కు డైరెక్షన్ ఇచ్చే వారే కరువవ్వడంంతో తెలంగాణ బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియక కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నట్లుగా తెలుస్తోంది. అటు కేంద్రమంత్రిగా ఇటు తెలంగాణ బీజేపీ రథసారథిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. కాగా స్టేట్ చీఫ్ గా ఆయనకు హైకమాండ్ అదనపు బాధ్యతలు మోపింది. హస్తినాలో ఆయన బిజీగా ఉండటంలో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టిపెట్టలేకపోతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూకుడుగా రాజకీయ విమర్శలతో దూసుకుపోతుంటే.. బీజేపీ నేతలు మాత్రం ఆస్థాయిలో అటాక్ చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.
Also Read: Minister Sridhar Babu: దేశ సమగ్రతకు మేమంతా అండగా నిలుస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు!
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణం పేరుతో ఎనిమిది నెలలుగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజా క్షేత్రంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించినా ఆ జోష్ కొనసాగించలేకపోతున్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నా కాషాయ పార్టీ నేతలు మాత్రం ప్రశ్నించడం లేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇచ్చే మీడియా స్టేట్ మెంట్స్ తప్పా క్షేత్రస్థాయిలో ప్రజాపోరాటాలు చేయలేకపోతున్నారని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కూడా బీజేపీ నేతలు ప్రచారం చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర కాషాయ దళపతిని త్వరగా నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి నేతలు అధిష్టానాన్ని బహిరంగంగా వేడుకున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. తెలంగాణ కాషాయపార్టీలో నెలకొన్న గందరగోళానికి హైకమాండ్ ఎలా చెక్ పెడెతుందనేది చూడాలి.
Also Read: Operation Sindoor Title: ‘ఆపరేషన్ సింధూర్’ టైటిల్ కోసం భారీ పోటీ.. ఓ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు!