Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్ర స్థావరాలను నాశనం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అటు విపక్షాలు సైతం ఈ సైనిక చర్యను స్వాగతించాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం తొలిసారి అఖిలపక్షం భేటి నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) నేత్వత్వంలో జరిగిన ఈ భేటికి పలువురు కేంద్ర మంత్రులతో పాటు విపక్ష కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లీకార్జున ఖర్గే, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తదితర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు.
‘100 మంది ఉగ్రవాదులు హతం’
తాజాగా నిర్వహించిన అఖిల పక్ష భేటిలో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన విషయాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. విపక్ష పార్టీల నేతలతో పంచుకున్నారు. మిషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వారికి వివరించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్ ద్వారా 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు విపక్ష పార్టీలకు తెలియజేశారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ ఇకపై కొనసాగుతుందని స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
రాహుల్ గాంధీ రియాక్షన్
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం తమ పార్టీ వైఖరిని ఈ భేటిలో మరోమారు వెల్లడించినట్లు తెలుస్తోంది. పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ.. కేంద్రానికి కొన్ని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అయితే వాటికి కేంద్ర కేబినేట్ ఆన్సర్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలని రాహుల్ కు సున్నితంగా సూచించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. భేటి అనంతరం మీడియాలో మాట్లాడిన రాహుల్.. ఈ సమావేశంలో చాలా చర్చించినట్లు చెప్పారు. గోప్యత దృష్ట్యా ఆ విషయాలను మీడియాతో పంచుకోలేమని అన్నారు.
మోదీ గైర్హజరుపై ప్రశ్నించా: ఖర్గే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే సైతం అఖిల పక్ష భేటి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ గైర్హాజరును ప్రత్యేకంగా భేటిలో ప్రస్తావించినట్లు చెప్పారు. పహల్గాం దాడి అనంతరం నిర్వహించిన భేటికి సైతం ప్రధాని రాలేదని ఖర్గే అన్నారు. తాను పార్లమెంటుకు అతీతుడని ప్రధాని భావిస్తూ ఉండొచ్చని ఖర్గే విమర్శించారు. మరో సందర్భంలో ఈ విషయమై మోదీని ప్రశ్నిస్తామని అన్నారు. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో ఎవరినీ తాము విమర్శించబోమని ఖర్గే స్పష్టం చేశారు.
Also Read: Operation Sindoor: భారత్ లో ఆ ఏరియాలను టార్గెట్ చేసిన పాక్.. సైన్యం వెల్లడి!
పాక్ ను గ్రే లిస్టులో చేర్చాలి: ఓవైసీ
అఖిలపక్ష భేటిలో పాల్గొన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై భారత సాయుధ బలగాలను, ప్రభుత్వాన్ని అభినందించారు. ఉగ్రవాదంపై పోరులో పలు కీలక సూచనలు చేశారు. పహల్గాం దాడికి తెగబడ్డ ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని చేపట్టాలని కేంద్రానికి సూచించినట్లు వెల్లడించారు. ‘టీఆర్ఎఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని అమెరికాను భారత్ కోరాలి. అదేవిధంగా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ద్వారా పాకిస్థాన్ ను గ్రే-లిస్టులో చేర్పించేందుకు మనం మరింత తీవ్రంగా ప్రయత్నాలు చేయాలి’ అని ఒవైసీ అన్నారు.