IND Neutralizes PAK Missile: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నేపథ్యంలో దాయాదీ దేశం పాకిస్థాన్ ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. భారత సైనిక చర్యకు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతామని పాక్ ప్రధాని షెగబాజ్ షరీఫ్ అన్నారు. ఈ క్రమంలో పంజాబ్ లో టెన్షన్ నెలకొంది. అమృత్ సర్ పట్టణంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే పాక్ జరిపిన మిసైల్స్ దాడిని భారత్ తిప్పికొట్టినట్లు తెలుస్తోంది.
బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పాక్ మిస్సైల్స్ పంజాబ్ లోని అమృత్ సర్ వైపునకు దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు.. వాటిని ధ్వంసం చేసినట్లు సమాచారం. యాంటి మిస్సైల్ టెక్నాలజీతో వాటిని కూల్చివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమృత్ సర్ సమీపంలోని గ్రామాల్లో పాక్ మిసైల్స్ కు సంబంధించిన శకలాలు పడిపోయినట్లు ఆర్మీ వర్గాలు తెలియజేస్తున్నాయి. వాటిని సైనికులు పరిశీలిస్తున్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Trisha Krishnan: వామ్మో.. 42 ఏళ్లలో ఇంత మంది ప్రియులా? దానికి కారణమిదే!
గత రెండ్రోజులుగా సరిహద్దులకు దగ్గర ఉన్న గురుద్వారాల పైనా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ క్రమంలోనే అమృత్ సర్ పైనా దాడి చేసేందుకు దాయాదీ దేశం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ పై దాడి జరిగిందంటూ పాక్ మీడియాలోనూ కథనాలు ప్రసారమయ్యాయి. అయితే దీనిని భారత సైన్యం ఖండించింది. కాగా అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఈ మిస్సైల్స్ పడిపోయినట్లు సమాచారం.
మరోవైపు భారత్ సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం రెచ్చిపోతోంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత నుంచి పూంచ్, తంగ్ధర్ సెక్టార్లలో పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో భారత్ కు చెందిన 13 మంది పౌరులు మృతి చెందగా 57 మంది గాయపడినట్లు సైన్యం అధికారికంగా వెల్లడించింది. పాక్ బలగాల దాడులను తిప్పికొడుతున్నట్లు పేర్కొంది.
Also Read This: High Security in Hyderabad: హైదరాబాద్ లో హైఅలర్ట్.. ఎక్కడ చూసినా బలగాలే.. ఏం జరుగుతోంది!
మరోవైపు పాక్ దాడులతో భారత్ లోని సరిహద్దు గ్రామాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ధ్వంసమైన ఇళ్లు, పగిలిన దుకాణాలు, దగ్ధమైన వాహనాలు, రక్తపు మరకలు, శిథిలాలతో సరిహద్దు గ్రామాలు భయానకంగా మారాయి. ఆలయాలు, స్కూళ్లు, మసీదులపైనా పాక్ సైన్యం షెల్లింగ్‌కు పాల్పడింది. గురువారం కూడా కాల్పులు కొనసాగినప్పటికీ, బుధవారంతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.