Kesineni Chinni: ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో (Kasireddy Rajasekhar Reddy) విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కు లింకులు ఉన్నాయని సొంత అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏ విధంగా సత్సంబంధాలు ఉన్నాయి? అనే విషయాలను లోతుగా వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నాని లేఖ రాశారు. ఈ విషయాలన్నీ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై నాలుగైదు రోజులుగా స్పందించని చిన్ని.. గురువారం నాడు నాని చేసిన ఆరోపణపై కౌంటర్ ఇచ్చారు. ‘ విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయి. వాటి గురించి కూడా నిగ్గు తేలిస్తే బాగుంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాజ్ కేసిరెడ్డికి సాన్నిహత్యం ఉంది. అందుకే రాజ్ కేసిరెడ్డిని దూరంగా పెట్టాను. ఏపీలో రూ.3200కోట్ల విలువైన లిక్కర్‌స్కామ్ జరిగింది. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నవ్యక్తే ఈ కుంభకోణానికి సూత్రధారి. ఆ ప్యాలెస్‌లో రాజ్‌తో సహా నలుగురికే ఎంట్రీ ఉంటుంది. ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నాను. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ సిద్ధమా?’ అని కేశినేని చిన్ని ఒకింత సవాల్ విసిరారు.
Read Also- Kesineni Nani: చిన్నిపై ‘లిక్కర్’ బాంబ్ పేల్చిన కేశినేని నాని.. సీఎం చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటో?
అన్నను పాలేరు అని సంబోధిస్తూ..
‘ నన్ను విజయవాడ పార్లమెంట్ ప్రజలు ఆదరించారు. గత 6 సంవత్సరాల నుంచి చూస్తే వైఎస్ జగన్ దగ్గర ఒక పాలేరు (కేశినేని నాని) చేరాడు. అతను జగన్ ఆలోచనలను అమలు చేస్తున్నాడు. 2020, 21 లో కేసిరెడ్డిని కలవడం జరిగింది. మా చిరాస్తుల పక్కన అతనికి చిరాస్తులు ఉండే అతను కేసిరెడ్డి. రియల్‌ఎస్టేట్ డెవలప్మెంట్‌లో భాగంగా కలవడం జరిగింది. కానీ జగన్‌కి అత్యంత దగ్గర వ్యక్తి అని అతనికి దూరంగా ఉండటం జరిగింది. రూ.3200 కోట్ల మద్యం స్కామ్ జరిగిన మాట వాస్తవమే. ఈ స్కామ్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి బెయిల్ నిరాకరించారు. అతని సమక్షంలోనే ఈ స్కామ్‌లు జరిగాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న నలుగురు సమక్షంలో ఈ స్కామ్‌లకు పాల్పడ్డారు. గత పది రోజుల క్రితం హైదరాబాద్‌లో ఒక ఐదుగురితో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడున్న పాలేరు మిగిలిన వారు ఉన్నారు. ఈ మద్యం స్కామ్‌ను డైవర్ట్ చేయటానికి ప్రణాళికలు రచించారు. జగన్ ప్రభుత్వంలోనే ఈ మద్యం స్కామ్ ముమ్మాటికీ జరిగింది. ఇక్కడున్న పాలేరు.. చంద్రబాబు అరెస్ట్ దగ్గర నుంచి అన్ని విషయాలు జగన్ మోహన్ రెడ్డికి చేరవేశాడు. డబ్బులు దుబాయ్, అమెరికాకు వెళ్ళాయి. డబ్బులు మళ్లించినట్లుగా నిరూపించేందుకు విచారణకు సిద్ధంగా ఉన్నాం’ అని కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు చేశారు.
Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుల ఫిర్యాదు
రూమ్ నంబర్ 4లోకే..!
‘ నా కష్టార్జితంతో పైకి ఎదిగాను. అవన్నీ పబ్లిక్ డోమైన్‌లో ఉన్నాయి. జగన్ అతని దగ్గర ఉండే పాలేరులు అన్ని అబద్ధాలు చెబుతారు. బాబాయ్ గొడ్డలి దగ్గర నుంచి హెలికాప్టర్ ధ్వంసం వరకు జగన్ డ్రామాలు ఆడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపైనే ఆలోచిస్తూ కష్టపడి పనిచేస్తాం. మద్యం స్కామ్ డబ్బులు జగన్ దగ్గరకి వెళ్లాయి. జగన్ రెడ్డికి రూ.3200 కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌లోని నాలుగో నెంబర్ గదిలోకి వెళ్లాయి. బాబాయ్‌ని చంపి చంద్రబాబు చేశారని అంటారు.. మద్యం స్కామ్ చేసి మాపైనే చెబుతారు. ఏది చేసినా జగన్, భారతీరెడ్డి ఇద్దరూ కలిసే చేస్తారు. డైవర్ట్ చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ దగ్గర పని చేసిన తొత్తులను విచారిస్తాం. త్వరలోనే వాళ్లంతా జైలుకు వెళ్తారు. మద్యం స్కామ్ గురించి సీబీఐకి లేఖ రాశాం. జగన్ నిజాయితీ పరుడైతే, దమ్ము ధైర్యం ఉంటే మద్యం స్కామ్‌పై సీబీఐ విచారణ చేయాలని కోరాలి. కేశినేని నాని.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వెళ్ళాడు. ఇతని వేషాలు తెలిసి పార్టీలో పక్కన పెట్టారు. మళ్ళీ జగన్ దగ్గరకి వెళ్ళాడు. దొంగలందరూ ఒకచోట ఉన్నారు’ అని కేశినేని చిన్ని ఆరోపించారు. మొత్తానికి చూస్తే అటు అన్న నానికి.. ఇటు వైఎస్ జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు అంతకుమించి ఆరోపణలే చిన్ని చేశారు. ఇప్పుడు కేశినేని నాని ఏం చేయబోతున్నారు? రియాక్షన్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also- YS Jagan: వైఎస్ జగన్ షాకింగ్ ప్రకటన.. ఆశ్చర్యపోయిన నేతలు!