Mallikarjun Kharge: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కేంద్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అదే సమయంలో మన సైనికుల ధైర్య సాహసాలను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాని ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్.. అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటికి ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసి వేణు గోపాల్ సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు.
తగిన బుద్ధి చెప్పారు
ఆపరేషన్ సింధూర్ పై ఏఐసీసీ నేతలు భేటి అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మీడియాతో మాట్లాడారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ కు తగిన రీతిలో సమాధానం ఇచ్చాయని తెలిపారు. దీనికి తామంతా గర్విస్తున్నట్లు తెలిపారు. సైనికుల ధైర్యానికి, సంకల్పానికి, వారి దేశ భక్తికి సెల్యూట్ చేస్తున్నట్లు ఖర్గే చెప్పారు. పహల్గాం దాడి (Pahalgam Terror Attack) ఘటన జరిగిన నాడే కేంద్రానికి కాంగ్రెస్ (Congress) తన మద్దతు తెలియజేసిందని గుర్తు చేశారు. సీమంతార ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పినట్లు గుర్తు చేశారు. పాకిస్తాన్, పీఓకే నుంచి ఉత్పన్నమయ్యే అన్ని రకాల ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా భారత్ దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.
రాహుల్ రియాక్షన్ ఇదే..
ఖర్గే ప్రసంగం అనంతరం రాహుల్ (Rahul Gandhi) ఒక్క విషయం గురించి మాత్రమే మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రేపు కేంద్రం ప్రభుత్వం అఖిల పక్ష భేటికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. దానికి కాంగ్రెస్ పార్టీ హాజరవుతుందని రాహుల్ స్పష్టం చేశారు. అంతకుముందు పాక్ పై వైమానిక దాడులు చేశామంటూ సైన్యం ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. సాయుధ దళాలను చూసి గర్విస్తున్నట్లు చెప్పారు. జైహింద్ అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.