Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో యావత్ దేశం శోక సంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తులు, కశ్మీరీల వేషదారణతో వచ్చిన ఐదారుగురు ముష్కరులు.. పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడి ద్వారా 26 మంది అమాయక భారత పౌరులను పొట్టన పెట్టుకున్నారు. అయితే ఉగ్రదాడి తర్వాత ఓ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితుల్లో భర్తను కోల్పోయిన ఓ స్త్రీ.. తనను చంపాలని కోరగా.. పోయి మోదీకి చెప్పుకో అంటూ టెర్రరిస్ట్ సమాధానం ఇచ్చాడు. తాజా దాడి నేపథ్యంలో ఆ మాటలను మరోమారు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.
ప్రధాని హామీ..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో యావత్ దేశం తీవ్ర ఆగ్రహజ్వాలలతో ఊగిపోయింది. మతం పేరుతో మరణాహోమానికి తెగబడిన ముష్కరులను అంతం చేయాలని ముక్తకంఠంతో నినాదించింది. ఈ క్రమంలో ఓ రాజకీయ వేదికపై మాట్లాడిన ప్రధాని.. ఎవరూ ఊహించని విధంగా ముష్కరులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దాడి వెనకున్న సూత్రధారులను సైతం శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా మంగళవారం అర్ధరాత్రి పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఏకంగా 80 మందికి పైగా ముష్కరులు చనిపోయినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
స్పెషల్ పోస్టర్ వైరల్
భారత్ చేసిన ప్రతీకార దాడితో యావత్ దేశం హర్షాతి రేకలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తీసుకున్న సైనిక చర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోయి మోదీకి చెప్పు? అన్న ఉగ్రవాది వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ప్రధాని మోదీకి చెబితే ఇలాగే ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ ఫొటోను సైతం నెట్టింట వైరల్ చేస్తున్నారు. ‘టెల్ మోదీ (Told Modi).. ఐ టోల్డ్ మోదీ’ క్యాప్షన్ తో ఉన్న ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మీకు ఎవరు ఉన్నారు!
తమకు అన్యాయం జరిగినప్పుడు భారత స్త్రీలు.. మోదీకి చెప్పుకున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టామని గర్వంగా చెప్పుకుంటున్నారు. మరీ మీకు చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారని పాక్ ముష్కరులను ప్రశ్నిస్తున్నారు. భారత్ పై తిరిగి దాడి చేసే దమ్ముందా? అంటూ నిలదీస్తున్నారు. చేసి తిరిగి ఎదుర్కొనే సత్తా మీలో ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Operation Sindoor: మసూద్ అజార్ కు బిగ్ షాక్.. టోటల్ ఫ్యామిలీ ఔట్.. రివెంజ్ అదుర్స్!
అసలేం జరిగిందంటే?
కర్ణాటకలోని షిమోగకు చెందిన మంజునాథ్, పల్లవి, తమ కుమారుడు అభినయ్‌తో కలిసి కశ్మీరు పర్యటనకు వెళ్లారు. పహల్గాం సందర్శనకు వెళ్లగా.. మంజునాథ్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కళ్లెదుటే భర్త ప్రాణాలు తీసేయడంతో తనను కూడా చంపేయాలని ఓ ఉగ్రవాదిని పల్లవి కోరింది. అప్పుడు ‘మేము నిన్ను చంపం.. పోయి ఇక్కడ జరిగింది మోదీకి చెప్పు.. అని వాళ్లలో ఒకరు బదులిచ్చారు’ అని పల్లవి తెలిపారు. దీంతో ఉగ్రవాదుల అహాన్ని ఎలాగైన అణిచివేయాలని భారతీయులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తాజా దాడులతో అదే జరిగిందని సంతోషిస్తున్నారు.