Chattisgarh Crime: ఒకవైపు నక్సల్స్ చర్చలు జరుపుతూనే మరోవైపు అమాయక గ్రామీణ ప్రజా ప్రతినిధులను హత్య చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. తాజాగా సుక్మా జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ప్రజాసామ్యం ద్వారా ఎన్నికైన ప్రతినిధిని దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని కుంట బ్లాక్ పరిధిలోని బైన్‌పల్లి గ్రామంలో ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి మావోయిస్టులు.. సర్పంచ్ ముచాకి రామాను అతని ఇంటి నుండి తీసుకెళ్లి గొంతు కోసి చంపారు.
చర్చలకని పిలిచి..
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. కొందరు నక్సల్స్ మామూలు దుస్తుల్లో రామా ఇంటికి వచ్చారు. అతడితో మాట్లాడాలని చెప్పి బయటకు పిలిచారు. అనంతరం సమీపంలోని అడవికి తీసుకెళ్లారు. ఆపై అక్కడ సర్పంచ్ ను హత్య చేసి.. మృతదేహాన్ని గ్రామం దగ్గర విసిరేశారు. మంగళవారం ఉదయం గ్రామస్తులు మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సర్పంచ్ గా ఏకగ్రీవం
ముచాకి రామా ఇటీవల ఉపసర్పంచ్ నుంచి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు ఆ ప్రాంతంలో ప్రజాదరణ చాలా ఉంది. రామా.. అభివృద్ధి పనులలో చురుగ్గా పాల్గొనే వారు. అటువంటి సర్పంచ్ ను నక్సలైట్లు హతమార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల క్షేమం, ప్రజాస్వామ్య పాలనే తమ లక్ష్యమంటూ చెప్పుకునే నక్సల్స్.. ఇలా అన్యాయంగా సర్పంచ్ ను పొట్టనబెట్టుకోవడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Obulapuram Mining case: ఓబులాపురం మైనింగ్ కేసు.. ఎంత పెద్ద కుంభకోణమో తెలుసా?
శాంతి అంటూనే.. హత్యలు!
ఒకవైపు ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని చెబుతూనే.. ఇలా అమాయక ప్రజల ప్రాణాలు తీయడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ప్రజా ప్రతినిధులను చంపడం ద్వారా తమ ద్వంద్వ స్వభావాన్ని మావోయిస్టులు బయటపెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తుపాకుల బలంతో వ్యవస్థను నడపాలనుకునే నక్సల్స్ ప్రజాస్వామ్య వ్యతిరేక మనస్తత్వాన్ని ఈ సంఘటన ఓ ఉదాహరణ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమాయక ప్రజా ప్రతినిధులను చంపడం ద్వారా భయాన్ని వ్యాపింపజేయాలని నక్సల్స్ చూస్తున్నట్లు చెప్పారు.